ప్రతి ఆడియో ఫంక్షన్ లోనూ యూనిట్ సభ్యులంతా కలిసి సినిమా చాలా బాగా వచ్చింది, హీరో చాలా ఇరగదీశాడు... హీరోయిన్ హాట్ హాట్... పాటలు... స్వీట్ స్వీట్ అంటూ ఎన్నో రకాలుగా ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు. కానీ ’టెంపర్’ ఆడియో ఫంక్షన్ లో ఈసారి ఎన్టీఆర్ నిర్మొహమాటంగా ‘అతి’ కనపడకుండా మాట్లాడాడు. ‘‘ప్రతిసారీ సినిమా సూపర్ హిట్ అని చెప్పడం నా వల్ల కాదు, ఎందుకంటే ఎక్కడో అభిమానులను నిరాశపరుస్తున్నాను అనే విషయం నాకు తెలుస్తోంది’’ అంటూ ఓపెన్గా చెప్పేశాడు. ‘‘కట్టుకున్న భార్యను ఎంత బంగారంగా చూసుకోవాలో, బిడ్డని ఎంత ఆప్యాయంగా చూసుకోవాలో... అభిమానులను అంతే ప్రేమగా చూసుకోవాలి... ఈ రోజు ఒంటిమీద ప్యాంట్ వేసుకొని నుంచున్నాను అంటే అది కేవలం మీ వల్లనే..’’ అంటూ అభిమానుల మనసును మరింత గెలుచుకున్నాడు. ఇంతకు ముందు సినిమాలతో అభిమానులను నిరాశపర్చినట్టు బాధను వ్యక్తం చేశారు. ‘‘నేను... హిట్లుస్తున్నానా...ఫ్లాపులిస్తున్నానా? అనే దానికంటే అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరగడం నేను చూడాలి... నాకు హిట్లూ, ఫ్లాపులూ వద్దు... సినిమాలు చేస్తూనే ఉంటా.... ఊపిరి ఉన్నంత వరకు ఇవే చేస్తాను... మీరు ఆనందపడేవరకు సినిమాలే చేస్తాను. మీరు గర్వపడేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు. ‘‘ఇప్పటి వరకూ ప్రతి సినిమా కష్టపడే చేశాను. కానీ ఈ సినిమా కసితో చేశాను. నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చకపోయినా ఫర్వాలేదు. మీకు నచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అంటూ ‘‘ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరంగా వర్ధిల్లి, పటాస్ తరువాత టెంపర్, లయన్ బంపర్ హిట్లు కావాలంటే ఆడియన్స్ తో పాటు లెజండరీ ఎన్టీఆర్ ఆశీస్సులు మాకు ఉండాలి’’ అంటూ అర్థించాడు. ‘‘నాకు అన్నయ్య జానకిరామ్ ఎంతో మీ అందరూ అంతే... రక్తం పంచుకు పుట్టకపోయినా మీరందరూ నా తోబొట్టువులే. దయచేసి మీరందరూ ఇంటికి సేఫ్ గా వెళ్ళండి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అన్యాయం చేయకండి’’ అంటూ అభిమానులను తన ఆప్యాయమైన మాటలతో ఆనందపరిచి వారి కేరింతలూ, కేకల మధ్య తన ఉపన్యాసాన్ని ముగించారు.