క్లాసిక్ చిత్రాల నిర్మాత కన్నుమూత

October 05, 2015 | 10:11 AM | 1 Views
ప్రింట్ కామెంట్
edida-nageswara-rao-passed-away-niharonline

ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన ఫూర్ణోదయ పిక్చర్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (81) ఇకలేరు. హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆయన రెండు వారాల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అయితే మల్టిపుల్ ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల మృతి చెందారని ఆయన కుమారుడు మీడియాకి తెలిపారు. ఆ లెజెండరీ నిర్మాత మృతికి నీహార్ ఆన్ లైన్ నివాళులర్పిస్తుంది.

1934 ఏప్రిల్‌ 24న ఆయన జన్మించారు. పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ స్థాపించి మైమరిపోలేని చిత్రాలను ఆయన నిర్మించారు. సిరిసిరిమువ్వ, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు వంటి క్లాసిక్ హిట్లను ప్రేక్షకులకు ఆయన అందించారు.

సినిమా అన్నది వ్యాపారం అయిపోయిన రోజుల్లో ఆయన తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఒక నిబద్ధతతో చిత్ర నిర్మాణాన్ని సాగించారు. ఎటువంటి అసభ్యతకు తావులేని, కళాత్మకతతో కూడిన కుటుంబ కథాచిత్రాలను నిర్మించడమే ధ్యేయంగా ఆయన తన ప్రస్థానాన్ని సాగించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ తో ఆయన అనుబంధం విడదీయలేనిది. వీరిద్దరి కలయికలో వచ్చిన శంకరాభరణం చిత్రం తెలుగు సినిమా స్థాయిని దశదిశలా వ్యాపింపజేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలను, సంగీత నృత్యాలను మేళవించి రూపొందించిన ఆ చిత్రం రసజ్ఞతతో కూడిన దృశ్యకావ్యంగా నిలిచింది.

తనతో బాటు వచ్చిన నిర్మాతలంతా ట్రెండులో పడి కొట్టుకుపోతున్నా, తాను మాత్రం ఏటికి ఎదిరీదినట్టుగా నిలబడి తన పరిధి దాటకుండా ఉత్తమ చిత్రాలను మాత్రమే నిర్మిస్తూవచ్చారు ఏడిద నాగేశ్వరరావు. చిత్ర నిర్మాణంలో వచ్చిన కొత్త పోకడలతో కాలం మారిపోవడంతో, ఇక తనబోటి నిర్మాతలకు స్థానం లేదని తెలుసుకున్నాక, ట్రెండుతో రాజీపడలేక గత కొన్నేళ్లుగా ఆయన చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వున్నారు. ఆయన మృతి చెందిన రోజు తెలుగు సినీ పరిశ్రమకు దుర్దినం’ అని ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ అన్నారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలోనే మరిచిపోలేని చిత్రాలు వచ్చాయి. అంతేకాదు వాటికి జాతీయస్థాయిలో పలు అవార్డులు కూడా వచ్చాయి. టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ