మహేష్ శ్రీమంతుడుకు మరి ఏడు రోజులే సమయం... కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. నిన్నటికి (జులై 30 1999) మహేష్ సినీ ప్రస్థానం 16 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆయన రాజకుమారుడతో సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. శ్రీమంతుడుతో ఆయన 20 సినిమాలు పూర్తి చేశారు. ప్రతి సినిమా కథలోనూ, టేకింగ్ లోనూ తన నటన లోనూ మార్పు ఉండాలని డైరెక్టర్లకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటాడు మహేష్... అయినా ఫ్లాపులకూ, విజయాలకూ ఒకే విధంగా స్పందిస్తూ... ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని తనతో పని చేసే డైరెక్టర్ల నుంచి లైట్ బాయ్ లవరకూ చెపుతారంటే ఇక్కడ మహేష్ వ్యక్తిత్వం గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తను మాట్లాడే విధానంలో ఎంత పెద్దవారినైనా... కింది స్థాయివారినైనా ఒకే విధమైన గౌరవంతో పలకరిస్తారు. తనో సూపర్ స్టార్ అన్న ఫీలింగ్ ఏ మాత్రమూ ఉండదు.
ఇక సినిమాల విషయానికి వస్తే అంతకు ముందు విడుదలైన ఆగడు, 1 నేనొక్కడినే ఫ్లాప్ అన్న టాక్ తెచ్చుకున్నాయి. కానీ 1 నేనొక్కడినే చాలా గొప్ప సినిమా అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే అంటారు ఫిలిం మేధావులు. మహేష్ సినిమాన్నింటిలోకీ ఈ సినిమాలో ఆయన నటన చాలా డిఫెరెంట్ గా ఉంటుందంటారు. కొందరయితే ఆయనకు అవార్డు ఇవ్వకపోవడంపై చాలా నిరసన వ్యక్తం చేస్తుంటారు. అది అభిమానులు మాత్రం కాదు... సినిమాలని బాగా అవపోసన పట్టిన ఫిల్మ్ క్రిటిక్స్ ఈ మాట అన్నారు. 1 నేనొక్కడినే సినిమా ఐఎండీబీ సైతం హాలీవుడ్ థ్రిల్లర్స్ కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చి.. మన సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పింది.
మొదటి సినిమా రాజకుమారుడు ఆ తర్వాత వచ్చినవి యువరాజు, వంశీ చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఆయన నటనను మాత్రం మెచ్చుకున్నారు. ఆయన మొదటి బ్లాక్ బస్టర్ అంటే 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం. ఆ తరువాత 2002 ఆయనకు అచ్చిరాలేదు. ఆ సంవత్సరం విడుదలయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి. 2003లో మళ్ళీ మహేష్ ఓ సూపర్ డూపర్ హిట్ దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ‘ఒక్కడు' చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. ఇది మహేష్ సినీ జీవితంలో మైలురాయి లాంటిది. ఇక అదే సంవత్సరం విడుదల అయిన ‘నిజం' చిత్రం పరాజయం పాలయినప్పటికీ, ఈ సినిమాలోని ఆయన యాక్షన్ బాగుంది. కాకపోతే మహేష్ ను అలాంటి క్యారెక్టర్ లో జనాలు చూడలేకపోయారు. ఈ సినిమా తో మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో ‘నాని 2004లో చిత్రం విడుదలైంది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి కానీ బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది.. అదే యేడాది విడుదలైన అర్జున్ పరాజయం కాలేదు కానీ అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమాకు పెట్టినంత ఖర్చుకు రీచ్ అవలేకపోయింది. తర్వాత మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. 2005లో విడుదల యిన ‘అతడు' చిత్రం కూడా మహేష్ కెరీర్ లో ఓ మంచి సినిమా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం థియేటర్లలో కన్నా టీవీలో ఎన్ని సార్లు వేసినా ఆడియన్స్ తప్పనిసరిగా చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రతి బిట్ మిస్ చేయాలనిపించదు. అతడు సినిమా నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది లభించింది. 2006లో మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ ‘పోకిరి' విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు. ‘పోకిరీ' తరువాత వచ్చిన ‘సైనికుడు' చిత్రం భారీ అంచనాలతో విడుదలయినా అనుకున్నంతగా ఆడలేదు. ఆ తరువాత వచ్చిన ‘అతిథి' చిత్రం ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. ఎందుకనో అథిది చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ‘ఖలేజా' భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా కూడా థియేటర్లలో అంతగా ఆడకపోయినా... టీవీల్లో మాత్రం ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉన్నారు. ‘ఖలేజా' తరువాత వచ్చిన 'దూకుడు' చిత్రం మహేశ్ మరో భారీ విజయం గా చెప్పుకోవాలి.. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేష్ తో కలిసి చేసిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీని తరువాత వచ్చిన మహేష్ బాబు ఆగడు, ‘వన్' సినిమా పరాజయం పాలయ్యాయి. ఈ రెండు ఫ్లాపులతో అభిమానులను నిరాశ పరిచానని మహేష్ వేదికమీద సారీ కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు శ్రీమంతుడు తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పాడు. ఈ కాన్సెప్టు కూడా కొత్తగా ఉండడంతో అభిమానులంతా ‘శ్రీమంతుడు' కోపం ఎదురు చూస్తున్నారు.