టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హీరో అయిన ప్రభాస్ ఈ యేడు పెళ్లి చేసుకోబోతున్నాడు. బాహుబలి-2 షూటింగ్ ముగిసిన వెంటనే పెళ్లి పీటలు ఎక్కుతాడంట. దీంతో ఈ ఆరడుగుల ఆజానుబాహుడి కోసం అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారంట పెదనాన్న అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఇక తన వంతుగా కూడా బాహుబలి సోదరుడు భల్లాలదేవుడు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన సోదరుడికి తగిన వధువు కావాలని సోషల్ మీడియా వేదికగా ఆహ్వానం ప్రకటించాడు. ఈ మేరకు వధువు గుణగణాలు ఎలా ఉండాలో వివరించాడు.
యువతికి యుద్ధవిద్యల పట్ల ఆసక్తి ఉండాలని భల్లాలదేవ స్పష్టం చేశాడు. కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధంలో కిటుకులు బాగా తెలిసిన వ్యక్తి అయిఉండాలని రానా పేర్కొన్నాడు. ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తగారిని గౌరవంగా ఆమె చూసుకోవాలని సూచించాడు. ఇంటి పనుల్లోనే కాకుండా యుద్ధ పన్నాగాల్లోనూ భర్తకు సహకరించాలని, శత్రువును ఓడించేందుకు భర్తకు కొత్త కొత్త టెక్నిక్ లు నేర్పించాలని రానా తెలిపాడు. 6.2 అంగుళాల ఎత్తున్న 36 ఏళ్ల 'బాహుబలి' ఇంట్లో భారీ పనులు సునాయాసంగా చేసేస్తాడని, మేకప్ స్వయంగా వేసుకోగలడని, అవసరమైతే భార్యకు కూడా మేకప్ వేయగలడని చెప్పాడు. వధువు ఎలా ఉండాలంటే చూడగానే తన కోసం కోండలు, చెట్లు, పుట్టలు ఎక్కే విధంగా ఉండాలంట. 'బాహుబలి'ని పెళ్లి చేసుకోబోయే ఆ రాకుమారి ఎవరో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరదాగా రానా పోస్ట్ చేసిన స్వయంవరం ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.