ఒకప్పటి బాలీవుడ్ డిస్కో డాన్స్ సిరీస్ హీరో, 'గోపాల గోపాల' చిత్రంలో స్వామిజీ వేషం వేసిన మిథున్ చక్రవర్తి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గత కొద్ది రోజులుగా శారదా చిట్ ఫండ్ కంపెనీ స్కామ్ లో ఇరుక్కుని రోజూ ఏదో రకంగా వార్తల్లో కనిపిస్తున్నాడు పాపం. అయితే కుంభకోణ ఆరోపణతో మూతపడిన శారదా చిట్ ఫండ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా తను అందుకున్న రూ. 1.2 కోట్లను నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి అప్పగించారు. ఆయన లాయర్లు, ఇతర ప్రతినిధులు కోల్‌కతాలోని ఈడీ దర్యాప్తు కార్యాలయానికి వెళ్లి రూ. 1.2 కోట్ల డిమాండ్ డ్రాఫ్టును దర్యాప్తు అధికారికి అందించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని తిరిగి ఇస్తానని ఇంతకుముందే మిథున్ విచారణలో తెలిపాడు. ఈ చిట్ ఫండ్ కంపెనీకి తనది వృత్తిపరమైన సంబంధమేనని, ఎవరినీ మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని మిథున్ విచారణలో చెప్పారు. ఈ మధ్య కాలంలో బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసినందుకు చాలా మందే కోర్టు గడప తొక్కుతున్నారు. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటుల్లో ఈయన కూడా ఒకరు.