తెలుగు చిత్రాలలో మల్టీ స్టారర్ చిత్రాల జోరు ఊపు అందుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న నాగ్-కార్తీల చిత్రానికి ఎట్టకేలకు టెంకాయ కొట్టేశారు. మున్నా, బృందావనం, ఎవడు చిత్రాల దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపారవేత్త పీ వరప్రసాద్ (పీవీపీ) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నాగార్జున, కార్తీలపై చిత్రీకరించిన తొలి షాట్‌కి అమల నాగార్జున క్లాప్‌నివ్వగా, పివిపి సతీమణి శ్రీమతి ఝాన్సీ సురెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. మొదటి షాట్‌కు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి డైరెక్ట్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి సబంధించిన తమిళ వెర్షన్ ప్రారంభోత్సవం ఫిబ్రవరి 28న చెన్నైలో గ్రాండ్‌గా జరగనుంది. మంచి సబ్జెక్ట్ తో దర్శకుడు తనను అప్రోచ్ అయ్యాడని చిత్రం ఖచ్ఛితంగా హిటవుతుందని హీరో నాగార్జున నమ్మకంగా చెబుతున్నాడు. ఇక మరో హీరో కార్తీ మాట్లాడుతూ తమిళంలో తాను నటించిన చిత్రాలను తెలుగులో ఆదరించినట్లే ఈ స్ట్రెయిట్ మూవీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈమధ్య విడుదలైన మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన గోపీసుందర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు. మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు దర్శకుడు వంశీపైడిపల్లి తెలిపాడు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.