ఈ మధ్య సీరియళ్ళలో సినిమా పాటలూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగించుకుంటున్నారు. వాటితో ఆ సీరియళ్ళు కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. అయితే వాళ్ళకు సీరియల్ వాళ్ళు కొంత సొమ్ము చెల్లిస్తారాట. ఇలాంటి వివాదం ఒకటి చోటు చేసుకుందిప్పుడు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘అత్తో అత్తమ్మ కూతురో’ సీరియల్ పై టాలివుడ్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మండిపడ్డారు. విడుదలైన, పాపులరైనా సినిమా పాటలను సీరియల్స్ లో వాడుకోవడానికి సీరియల్ నిర్మాతలు సొమ్ము చెల్లిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కాని, విడుదల కాని చిత్రాలలోని పాటలను కూడా సీరియల్ లో వాడుకోవడం ఎంతవరకు సబబని ఆర్పీ ప్రశ్నిస్తున్నారు.
తను సంగీతం అందించిన తులసీదళం చిత్రంలోని ఓ పాటను తమ అనుమతి లేకుండా అత్తో అత్తమ్మ కూతురో అనే సీరియల్ లో వాడుకున్నారని.. దీనిపై తాము సదరు నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా..తమకు జరిగిన నష్టం కింద 50 లక్షల రూపాయల డ్యామేజీ దావా వేస్తున్నట్టు ఆర్పీ పట్నాయక్ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో వేచి చూద్దాం...