‘చిత్రం, నువ్వు`నేను, జయం, దిల్, సంతోషం’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌కి మ్యూజిక్ అందించిన ఆర్.పి.పట్నాయక్ దర్శకుడిగా మారి ‘బ్రోకర్’ లాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించి, ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో.. అందాలతార ప్రియమణి ప్రధాన పాత్రలో, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. ఏక కాలంలో తెలుగు, కన్నడ బాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో ‘ఎం.జి.ఎం`100 క్రోర్ అకాడమి’ బ్యానర్స్‌పై అచ్చిబాబు.యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్ర దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ... ‘‘కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్న ప్రియమణికి నా థాంక్స్. ఎక్కువగా గ్లామర్ పాత్రలలో నటించే ప్రియమణి ‘ప్రతిక్షణం’లో పవర్‌ఫుల్ సిబిఐ ఆఫీసర్ పాత్ర పోషించింది. తన మేనరిజం, పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో పాటలు లేవు, కానీ ఆ లోటును రీ-రికార్డింగ్‌తో భర్తీ చేసాం. హైదరాబాద్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ బాషలలో ఒకేసారి తీయడం జరిగింది. ‘బ్రోకర్’ చిత్రం లాగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.
చిత్ర నిర్మాత అచ్చిబాబు మాట్లాడుతూ... ‘ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో మా బ్యానర్‌లో చిత్రం రావడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఆర్.పి తీసిన ‘బ్రోకర్’ చిత్రాన్ని చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆ చిత్రం తర్వాత.. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘ప్రతిక్షణం’ మా బ్యానర్‌లో రూపొందుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో సిబిఐ ఆఫీసర్‌గా ప్రియమణి పెర్‌ఫార్మెన్స్ అవార్డ్ విన్నింగ్ రేంజ్‌లో ఉంటుంది. ఒక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభించాం’ అన్నారు.
‘ఎం.జి.ఎం`100 క్రోర్ ఆకాడమి’ బ్యానర్స్‌పై తెలుగు`కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సమర్పణ: వి.యస్.పి.తెన్నేటి, నిర్మాత: అచ్చిబాబు.యం, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్!!