నడిగర్ ఎన్నికలు అయిపోయి 2 రోజులవుతోంది. కానీ ఓడిన వర్గం వారు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. ఈ రోజు శరత్ కుమార్ ఇప్పటికే తాను నీతి మంతుడినంటూ మీడియాకు వెల్లడి చేశారు. ఇప్పుడు శరత్‌కుమార్ ప్యానెల్‌పై విశాల్ టీమ్ చేసిన ఆరోపణలు నిరాధారమని ఒక వార్త బయటికి వచ్చింది. దీంతో శరత్‌కుమార్ సతీమణి రాధిక ట్విట్టర్ యుద్ధానికి సిద్ధమైంది. మూడు దశాబ్దాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి శరత్‌కుమార్ ఎంతో సేవ చేశారంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. నడిగర్ సంఘ భవన నిర్మాణ ఒప్పందాన్ని గతంలో రద్దు చేసుకున్నామని, అయినా దీనిపై లేనిపోని ఆరోపణలు చేశారని దుయ్యబట్టింది. ఈ విషయంలో శరత్ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది. నడిగర్ సంఘ భవనం పేరుతో నిజాలు తెలుసుకోకుండా శరత్‌పై విమర్శలు గుప్పించిన ఫ్రెండ్స్ అంతా సిగ్గుతో తలదించుకోవాలని, శరత్‌ను తలచుకుంటే ఇప్పుడు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది. శరత్ కుమార్ పై ఆరోపణలు చేసిన నెగ్గిన బృందం దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.