అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. అవసరమైతే...విధానాల్లో రాజీకొస్తారు. పెద్దగా సిద్ధాంత రాద్ధాంతాల జోలికిపోరు. పైచేయి సాధించాలన్న సంకల్పంతో...సందర్భం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన నేర్పరి. అప్పటి దాకా వెనుకేసుకు రాగలరు...ఆ వెంటనే తిరస్కరించనూగలరు. ఆయనెవరో తెలిసిందా... ఆయనే సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. ఉత్తరప్రదేశ్ లో రెండు దశాబ్దాలుగా ఢక్కామొక్కీలు తిన్న నేత ! వివిధ సామాజిక వర్గాల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్ లో దశాబ్దకాలంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం పీఠాన్ని కొడుక్కి అప్పగించిన ములాయం...కేంద్రంపై కన్నేశారు. దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కిస్తే... ములాయం జీవితంలోని ఎత్తుపల్లాలను ఆధారంగా తీసుకుని ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్ర షూటింగ్ బుధవారం యూపీలో ప్రారంభంకాబోతుంది. ములాయం పాత్రను క్యారెక్టర్ నటుడు రఘువీర్ యాదవ్ పోషిస్తున్నాడు. ములాయం బాల్యం నుంచి రాజకీయాల వరకు ప్రస్తానాన్ని ఇందులో తెరకెక్కిస్తారట.ఇక ఈ చిత్రానికి నేతాజీ ములాయం సింగ్ యాదవ్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఆయన తనయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు ములాయం ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారులేండి. టైటిల్ పై ప్రస్తుతానికైతే ఏం గలాట లేదు. మరి భవిష్యత్ లో ఉండకపోతుందంటారా? ఎన్ని వివాదాస్పద అంశాలను ఇందులో చూపిస్తారో?