బాహుబలి ప్రెస్ మీట్ లో అపశృతి...

July 07, 2015 | 12:53 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Rajamouli_at_bahubali_press_meet_niharonline

 ‘బాహుబలి' చిత్రం విడుదలవుతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రాజమౌళితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాహుబలి నిర్మాత శోభు యార్ల గడ్డ, డివివి దానయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘బాహుబలి' పైరసీ కాకుండా అడ్డుకోవాలని రాజమౌళి, అల్లు అరవింద్ ప్రేక్షకులను విన్నవించారు. అయితే ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలతో రాజమౌళి అసహనానికి గురయ్యారు. టిక్కెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్లనే పైరసీ విస్తరిస్తోందంటూ మీడియా వారు ప్రశ్నలు సంధించారు. గతంలో టికెట్స్ రేటు తక్కువ ఉన్న రోజుల్లోనూ పైరసీ ఉంది...అప్పుడు పైరసీ ఎందుకు జరిగిందంటూ రాజమౌళి ఎదురుప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాబాసగా మారింది. మధ్యలో అల్లు అరవింద్ కలుగ జేసుకుని బాహుబలి సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లేది మీడియా వారే....అనవసరంగా మాకు మీకు మధ్య వాగ్వాదం ఎందుకు, దయచేసి మాకు సహకరించండి అంటూ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేసారు. మరో వైపు బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రముఖులు కొన్ని పత్రికలకు, ఛానల్స్ కు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నారని మరికొందరు ఆందోళన చేయగా....షెడ్యూల్ ప్రకారం అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నామని నిర్మాత శోభుయార్ల గడ్డ తెలిపారు. ప్రెస్ మీట్ సాఫీగా జరిగే పరిస్థితి లేక పోవడంతో అర్ధాంతరంగా మీడియా సమావేశం ముగించారు. దయచేసి పైరసీ చేయొద్దని, పైరసీకి పాల్పడకుండా థియేటర్లలో కట్టడి చేయాలని, బాహుబలి తెలుగు వారు గర్వపడే సినిమా అని, పైరసీకి పాల్పడితే మానిటరింగ్ సెల్ కు తెలియజేయాలని అల్లు అరవింద్ కోరారు. ఉద్దేశ్ పూర్వకంగా పైరసీ చేస్తే థియేటర్లపై ఏడాది పాటు నిషేధం ఉంటుందని అల్లు అరవింద్ తెలిపారు. బాహుబలి థియేటర్లలో చూడాల్సిన సినిమా అని, సెకండ్ షో తర్వాత పైరసీ జరుగుతోందని, పైరసీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజమౌళి కోరారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ