ఒకే హీరోయిన్ రెండు మూడు సినిమాలు ఏక కాలంలో చేయడమంటే... ఎలా సాధ్యం అనిపించడం సహజం. కానీ చేసేస్తుంటారు. పోనీ ఒకే భాషా చిత్రాల్లో చేస్తున్నారా అంటే అదీ కాదు ఒక టాలీవుడ్, ఒక బాలీవుడ్ కూడా కలిపి నరుక్కొచ్చేస్తుంటారు. ఇప్పుడున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్ల చేతిలో మూడేసి సినిమాలు ఉన్నాయి. ఆ మధ్య శృతి పివిపి సినిమాను కేన్సిల్ చేసుకొని గొడవలో చిక్కుకుని కొన్నాళ్ళు టెన్షన్ పడింది. రకుల్ కూడా మహేష్ బాబుతో సినిమా ఒప్పుకుని మళ్ళీ చేయలేనంటూ... కేన్సిల్ చేసుకుంది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ బాగానే సర్దుబాటు చేసుకుంది కూడా... తను ఎలా ఇలా మేనేజ్ చేస్తుందని తోటి హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారట. రకుల్ యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ ఎక్కడా కాల్షీట్ల సమస్య రానీయలేదు ఇప్పటి వరకూ. అదృష్టమేమిటంటే... రకుల్ చేసిన సినిమాలకి షూటింగ్ మధ్యలో ఎలాంటి అంతరాయం తలెత్తలేదు. దీంతో ఆమె చకచకా సినిమాలు చేసుకొంటూ వెళ్లిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే రకుల్కి కాల్షీట్ల సమస్య మొదలైనట్టు తెలుస్తోంది. మహేష్ సినిమా వదులుకున్నప్పటికీ మళ్లీ వెంటనే అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు ఒప్పుకొంది. ఇప్పుడు డేట్ల సర్దుబాటు చేయలేక నానా తంటాలు పడుతోందట. ఎన్టీఆర్ సినిమా లండన్ లో.... రామ్ చరణ్ సినిమానేమో బ్యాంకాక్ , హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ రెండు సినిమాలకే ఇబ్బంది అవుతుంటే... ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇక చేసేదేం లేక బన్నీసినిమా సెట్లోకి ఇప్పట్లో రానని చెప్పేసిందట రకుల్. మరో నెల రోజుల తర్వాతే తన పార్ట్ షూటింగ్ పెట్టుకోమని చెప్పిందట. ఇప్పుడు అర్జున్ సినిమా షూటింగ్ తను లేని పార్టులు మాత్రమే షూట్ చేసేసుకుంటున్నారట. అదండీ రకుల్ మూడు సినిమాల ముచ్చట...