ఒక యుద్ధంలా మొదలు పెట్టిన బాహుబలికి నిన్నటితో ఫలితం దక్కింది. ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న బాహుబలి టీంకు ఊరట కలిగింది. ఇండియాతో పాటు యూఎస్ లో కూడా ఇంతకు ముందు ఇండియన్ సినిమా రికార్డును బద్దలు కొట్టింది. అయితే కథ గురించి కొంతమంది మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నా, మొత్తంగా చూసుకుంటే మంచి మార్కులే దక్కించుకుంది. ఈ సినిమాపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. అందులో రామోజీ రావు ఒకరు, ఆయన రాజమౌళి పనితనాన్ని చాలా పొగిడేశారు. సినిమా ఓ అద్భుతం అన్నారు. అయితే సెకండ్ పార్ట్ కి కూడా తనవంతు సహకారం అందుతుందని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండో సినిమా పనుల్ని మొదలు పెట్టాలని రామోజీరావు సూచించాడట. తొలి పార్ట్ బాహుబలి రామోజీరావు ఆర్థికంగా, ఫిల్మ్ సిటీ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించిన విషయం తెలిసిందే. రెండో పార్ట్ కు కూడా చిత్ర బృందం ఏం అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. సినిమాని, రాజమౌళిని అభినందిస్తూ లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఓ బహిరంగ లేఖని విడుదల చేశారు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాజమౌళిని ఆయన కొనియాడారు.