యాడ్ లు ఉన్నది ఆయా కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయటానికి. కానీ, అదే టైంలో మితిమీరి నాణ్యతను ప్రచారం చేయటం, అందులో కల్పితాలను ఎక్కువగా జోడించటంతో మొదటికే మోసానికి వచ్చేస్తున్నాయి. ఆపై కేసులు ఎదుర్కొవటం కంపెనీలతోపాటు యాడ్ లలో నటించిన వారి వంతు అవుతుంది. ఆ మధ్య మ్యాగీ యాడ్ బిగ్ బీ, ఆ తర్వాత ఓ ఆన్ లైన్ అమ్మకాల సైట్ లలో రణ్ బీర్ కపూర్ లపై కేసులు నమోదవ్వటం మనం చూశాం. మాదేం తప్పులేదు ముర్రో అంటున్న మీరు చెప్పారు గనుకే మేం కొన్నాం అనటం వినియోగదారుల వంతు అవుతుంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా నటించిన ఓ యాడ్ పై ఇలాంటి ఫిర్యాదే అందింది.
తన అభిమాన నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ఓ ఫేస్ క్రీమ్ యాడ్ చూసి దానిని వాడడట. అయితే, ప్రకటనలో షారూఖ్ చెప్పినట్టు ఎటువంటి ఫలితం రాలేదని ఆరోపిస్తూ నిఖిల్ జైన్ (23) అనే యువకుడు కోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని మూడు వారాలు వాడితే, ముఖం రంగు వికసిస్తుందని ప్రకటనలో హామీ ఇవ్వగా, తాను షారూఖ్ పై నమ్మకంతో 2012 అక్టోబర్ 8న దీన్ని కొనుగోలు చేశానని, నెలరోజులు వాడినా ఫలితం రాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. తన న్యాయవాదితో కలసి నిఖిల్ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు.
మూడేళ్లపాటు కేసు విచారణ కొనసాగగా, సదరు యువకుడికి రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఫేస్ క్రీమ్ సంస్థను ఆదేశించింది. తక్షణమే ఆ వ్యాపార ప్రకటనను తక్షణం తొలగించాలని కూడా ఆదేశించింది. "అందం పేరిట ఇలా పనికి రాని ఉత్పత్తులను కొని తనలా ఎవరూ నష్టపోకూడదనే ఇలా చేశానంటున్నాడు. అయితే షారూఖ్ తన అభిమాన నటుడు కావటంతోనే ఆయన పేరును ఫిర్యాదులో పేర్కొనలేదని చెబుతున్నాడా యువకుడు. మొత్తానికి షారూఖ్ సలహా పాటిస్తే అందం రాకపోగా 15లక్షల సొమ్ము మాత్రం వచ్చి చేరింది.