సైమా నాలుగవ పురస్కారాల వేడుకను దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో వచ్చే నెల 6, 7 తేదిల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సైమా అవార్డుల కార్యక్రమం విశేషాలను తెలియజేయడానికి తాజాగా ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో హీరో రానా, హీరోయిన్లు శ్రియ, కృతి కర్బందా, పూజా హెగ్డే, ఆదాశర్మ, షర్మిలా మాండ్రేలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా హీరో రానా మాట్లాడుతూ... సైమాలో పాల్గొనడం ఓ మధురమైన జ్ఞాపకం. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నాలుగు సినీ ఇండస్ట్రీలో కలిసి అంతర్జాతీయ స్థాయిలో పురస్కార వేడుక జరుపుకుంటున్నాయి. ఈ ఏడాది నాలుగు భాషల నుంచి అద్భుతమైన చిత్రాలొచ్చాయి. సైమా వేడుక ఈసారి మరింత గ్రాండ్ గా జరుగబోతుంది అని అన్నారు. అయితే ‘ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికైతే బాగుంటుంది’ అంటూ మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు రానా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. రానా మాట్లాడుతూ... ఈ సైమా పోటీలో లేకపోయినప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారికి పురస్కారం ఇవ్వడమే సముచితమని భావిస్తున్నాను అని అన్నారు. అలాగే వెంకటేష్, నాగచైతన్య కూడా పోటీలో వున్నారు కదా? మరి వారిలో ఎవరికి వస్తే బాగుంటుందని అడగగా... వెంకటేష్ గారికి చాలా అవార్డులొచ్చాయి. ఆయనకు ఇపుడు సైమా అవార్డు వస్తే దాన్ని నేనే తీసుకురావాల్సి వుంటుంది. అందుకే నాగ చైతన్యకు వస్తే బాగుంటుందని అనుకున్నానని రానా అన్నాడు.