ఊర్మిళా మటోండ్కర్ ని తలుచుకుంటే చిన్న స్కర్ట్ వేసుకొని యాయిరే.. అంటూ చిందులేసిన ఆమె పాట కళ్ళముందు కదిలిపోతుంది... అప్పట్లో యువతను తన అందచందాల్తో కట్టి పడేసిన ఊర్మిళ మళ్లీ తెరపైకి వస్తానంటోంది. ఈ అమ్మడు హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఇండియా మొత్తం మీద అభిమానులను కూడగట్టుకుంది. రంగీలా చిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ అమ్మడు తెలుగు డైరెక్ట్ సినిమాలు అనగనగా ఒక రోజు, అంతం, గాయం చిత్రాల్లో నటించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో హిందీలో చేసిన సినిమాలు చాలా తెలుగులోకి డబ్ చేశారు. సత్య, 12వ అంతస్తు లాంటి సినిమాలు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యాయి. ఈ మధ్య ఓ కార్యక్రమంలో తళుక్కున మెరిసిన ఊర్మిళను చూసి... ఇన్నేళ్ళ తరువాత చెక్కుచెదరని తన అందాన్ని చూసి ఆశ్చర్యపోయారట సినీ సెలెబ్రిటీలు. అయితే ఇన్నేళ్ళకు మళ్లీ ముఖానికి రంగేసుకుంటానంటోంది ఈ భామ. దర్శకుడు కరణ్‌జోహార్ కొత్తగా తాను రూపొందిస్తున్న ఓ చిత్రంలో ఆమెకు అవకాశం ఇస్తానని మాట ఇచ్చారట. దీంతో ఊర్మిళ మళ్ళీ తెర మీదకు రావడం ఖాయమని అనుకుంటున్నారు ఫిల్మ్ అభిమానులు.