శ్రీనువైట్ల-చరణ్ కాంబినేషన్ లో తీయబోతున్న సినిమాకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఒక సినిమా సక్సెస్ అయితే వాళ్ళను ఆహా ఓహో అంటూ నెత్తికెత్తుకోవడం, ఫ్లాప్ తో కిందకు దోయడం సినిమా ఫీల్డులో సర్వ సాధారణం. ఆగడు సినిమా చవి చూసిన ఫ్లాప్ తో ఇప్పుడు శ్రీనువైట్ల పరిస్థితి అలాగే తయారైంది. మొన్నటిదాకా నేను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించిన వైట్ల.. 'ఆగడు' ఫ్లాప్ పుణ్యమా అని కొన్ని అభిమానాలు పక్కకు పెట్టక తప్పడం లేదు. 'ఆగడు' విడుదలయ్యాక ఆరు నెలల పాటు శ్రమించి ఓ స్క్రిప్టు ఫైనలైజ్ చేస్తే, అది రామ్ చరణ్ కు నచ్చలేదు. చిరంజీవి సూచన మేరకు వైట్లతో మళ్లీ జట్టు కట్టేందుకు ఓకే అన్న కోన వెంకట్ శ్రీను వైట్ల తయారు చేసిన స్క్రిప్టును ఓసారి పరిశీలించాడట. ఐతే సెకండాఫ్ అంత సంతృప్తికరంగా లేదని, స్క్రిప్టులో మార్పులు చేయడానికి ఓకే అన్నాడట. దీంతో చరణ్ సినిమా మరి కాస్త ఆలస్యం అవుతోంది. ఇక ఈ ఇద్దరు కలిస్తే రామ్ చరణ్ సినీ ఖాతాలో ఒక మంచి హిట్ పడవచ్చునేమో.