ప్రస్తుతం సినీ ప్రముఖుల బర్త్ డే పార్టీలు, సక్సెస్ పార్టీలు ఫాం హౌసుల్లో జరగడం సర్వసాధారణమై పోయాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 26న ప్రకాష్ రాజ్ బర్త్ డే పార్టీని పలువురు సినీ ప్రముఖులతో తన ఫాం హౌజ్ లోనే జరుపుకున్నాడు. ఈ పుట్టిన రోజు వేడుకకు హాజరైన సినీ రచయిత కోన వెంకట్, నిర్మాత డివివి దానయ్య దారి దోపిడీకి గురయ్యారట. వీరి కారు వెనకాలే వస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల, తమన్ ఈ దోపిడీ బారిన పడకుండా తప్పించుకున్నారు. హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు వీరి కారుపై గొడ్డళ్ళతో దాడికి దిగారట. ప్రకాష్ రాజ్ ఫాం హౌస్ షాద్ నగర్ దగ్గర్లో ఉంది. పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. పార్టీ అనంతరం దానయ్య, కోన వెంకట్, మరో వ్యక్తి ప్రవీణ్ డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో కలిసి ఒక కారులో బయల్దేరారు. కొంత దూరంలో ఉన్న కల్వర్టు దగ్గరకు చేరుకోగానే అక్కడ రోడ్డుకు అడ్డంగా చెట్టు ఉండటంతో కారు ఆపారట. ఇంతలో ఇరువురు దుండగులు గొడ్డళ్లతో వచ్చి కారు అద్దాలు పగులగొట్టి, డ్రైవర్ పై దాడి చేసి, కోన వెంకట్, దానయ్యల మెడలో ఉన్న బంగారు గొలుసులు, చేతికున్న ఉంగరాలు, డ్రైవర్ దగ్గరున్న నగదు లాక్కున్నారు. వీరి వెనకే మరో కారులో వస్తున్న తమన్, శ్రీను వైట్ల దూరం నుంచే వీరి పరిస్థితిని గమనించి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ దాడి సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా వాళ్ళపై సినిమా టైప్ లో దాడి చేసి దుండగులు దోచుకోవడం పై సినీ వర్గంలో చర్చనీయాంశం అయ్యింది. పార్టీ విషయం తెలిసే దారి కాచి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఈ సంఘటనతో ఫాం హౌస్ పార్టీలకు హాజరవ్వాలంటే జనాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.