కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న సినీ నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ (57) కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ‘ఆహుతి’ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా మొత్తం 122 చిత్రాలలో ఆయన నటించారు. గత నాలుగేళ్ల నుంచి కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసాద్ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం ఉదయం ఫిలిం చాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆహుతి ప్రసాద్ మృతితో బంధువులు, అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రుద్రమదేవీ ఆయన ఆఖరి చిత్రం.