ఐశ్వర్య మళ్ళీ పూర్వపు సొగసును సంతరించుకుంది. 2014, 2013 కేన్స్ ఫెస్టివల్ నాటి ఐశ్వర్య ఫొటోలకు ఇప్పటి ఐశ్వర్యకు పోలికలే లేవనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మునుపటి విశ్వసుందరి మన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. తన శరీరాన్ని మళ్ళీ మెరుపు తీగలా మలుచుకుంది. బిడ్డ తల్లి అయ్యాక కొన్నాళ్ళ వరకూ తనను చూసిన వారు ఇక అయిపోయింది ఐశ్వర్య పని అన్నంత స్థూలకాయంతో కనబడింది. బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘జాజ్బా' చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. మళ్ళీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ఆమె ఓ రియల్ లైఫ్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతోంది. పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో సరబ్జీత్‌సింగ్ సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తొలుత ప్రియాంకచోప్రా, కంగనారనౌత్, దీపికాపదుకునే పేర్లను పరిశీలించారు. అయితే దల్బీర్‌కౌర్‌లాంటి ధీర వనిత పాత్రకు ఐశ్వర్యరాయ్ మాత్రమే న్యాయం చేయగలదని భావించి ఆమెను ఎంపికచేశామని దర్శకుడు చెప్పారు. 1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవే శించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్ సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్ గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు రెండేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్ సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి సరబ్జీత్ సింగ్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరక యాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమాను తీయడానికి రెడీ అయ్యారిప్పుడు. రియల్ కథ ఆధారంగా తీస్తున్న సినిమా, అది కూడా పాకిస్తాన్-ఇండియా నేపథ్యంలో తీస్తున్న కథాంశం కావడంతో చిత్రానికి బాగా ఆదరణ ఉంటుందని కూడా భావించవచ్చు.