మొదటి సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’ తో తెలుగులో పెద్ద హిట్టిచ్చిన ప్రభుదేవా.... ఆ తరువాత తెలుగు సినిమాలను హిందీలో రీ మేక్ చేస్తూ బాగానే క్లిక్ అయ్యారు. పోకిరీ, విక్రమార్క సినిమాలు బాలీవుడ్ లోకి తీసుకు వెళ్ళి మంచి హిట్లిచ్చి తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటాను కూడా రీమేక్ చేసి ఓ మోస్తరుగా నడిపించారు. తీసిన సినిమాలన్నీ 100 కోట్ల కు చేరిపోవడంతో బాలీవుడ్ ఈ దక్షిణాది దర్శకుడికి బ్రహ్మరథం పట్టింది. అయితే.. ఇటీవలే ప్రభు తీసిన రెండు, మూడు చిత్రాలు ఫ్లాప్ కావడంతో అతని ప్రభ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఒకప్పుడు అతను చెప్పిందే వేదంగా భావించిన నటులే, ఇప్పుడు ఇతనికే సలహాలు ఇస్తున్నారంటే.. ప్రస్తుతం ప్రభు పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అందుకు ఉదాహరణగా.. తాజాగా ఇతనికి ఎదురైన ఒక సంఘటనను చెప్పుకోవచ్చు. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు ప్రభుదేవ. ఆ చిత్రంకోసం ఇటీవల ఓ స్ర్కిప్టును తీసుకువెళ్ళి అక్షయ్’కి వినిపించగా.. అంతా విన్న తర్వాత అతనికి ఆ స్టోరీ నచ్చలేదంటూ నిర్మొహమాటంగా ప్రభుతో చెప్పేశాడట! మార్పులు చాలా అవసరమని సలహాలు కూడా ఇచ్చాడట. ప్రభు చాలా హర్ట్ అయ్యి ఉంటాడు పాపం. అతను చెప్పినట్లుగానే కథలో మార్పులు చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఇక ఈ ప్రాజెక్ట్. కు మోక్షం ఎప్పుడో మరి... అదండీ ఓడలు బండ్లు, బండ్లు ఓడలవడమంటే...