అందం+అభినయం+అంకితభావం=అనుష్క. సినిమా ఇండస్ట్రీలో అసలు కథానాయిక అంటే గ్లామర్ పాత్రల్లో మెరిసే ఓ బొమ్మ అన్న ఆలోచన మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఆ ఆలోచనను పటాపంచల్ చేసి కథానాయికకి సరైన నిర్వచనం చెప్పింది. అనుష్క శెట్టి అలియాస్ స్వీటి. ఓ అరుంధతి, ఓ సరోజా, ఓ దేవసేన, ఓ రుద్రమదేవీ ఇలా పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేసి అందులో లీనమైపోయి జీవించేస్తుంటుంది. అందుకే తన తోటి కథానాయికలకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ రోజు(నవంబర్ 7) ఆమె 35వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అనుష్కపై నీహార్ ఆన్ లైన్ ప్రత్యేక కథనం...
1981 నవంబర్ 7 న బెంగళూర్ లో జన్మించింది అనుష్క శెట్టి. యోగా టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సూపర్(2005) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆపై తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించే చాన్స్ కొట్టేసింది. కానీ, 2009లో కొడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి ఆమె కెరీర్ ను మలుపు తప్పింది. జేజెమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది అనుష్క. లేడీ ఓరియెంటల్ సినిమాలకు ఆస్కారం లేదని విమర్శలు వస్తున్న సమయంలో అరుంధతి ప్రభంజనం గట్టి జవాబుగా నిలిచింది. సరోజగా వేశ్యపాత్రలో వేదంలో పెద్ద షాకే ఇచ్చింది. కెరీర్ సవ్యంగా ఉన్న టైంలో అలాంటి పాత్ర చేయటం నిజంగా ఆమె గట్స్ కి హాట్సాఫ్ చెప్పాలి.
ఓవైపు తెలుగుతోపాటు తమిళంలో కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తూ అగ్రతారగా దూసుకెళ్తుంది అనుష్క. గ్లామర్ తోపాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకోవటంలో ఆమె దిట్ట. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలిలో దేవసేన పాత్రలో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక గుణ శేఖర్ కోసం రుద్రమదేవీగా మారి లైఫ్ నిచ్చింది. బాహుబలి, రుద్రమదేవి కోసం గుర్రపుస్వారీ, కత్తియుద్ధం సాధన చేసింది. 'సైజ్ జీరో' కోసం ఉన్న పళంగా బరువు పెరిగింది. డేట్స్ లేకపోతే ఒక కథానాయిక కాకపోతే మరొకరు అనే భావన తన విషయంలో తలెత్తకుండా చేసిన నాయిక ఆమె. బహుశా సినిమాల కోసం ఇంతగా కష్టపడే హీరోయిన్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చూసి ఉండకపోవచ్చు. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్. నీహార్ ఆన్ లైన్ తరపున అనుష్కకు విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నీ జరుపుకోవాలని, మరిన్ని చిత్రాలను మనకు అందించాలని మనసారా కోరుకుందాం.