ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి-2 కి ముహుర్తం ఖరారైందా? వచ్చే ఏడాది చివర్లో ఆ చిత్రం విడుదల కానుందా? అసలు సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' మొదటి భాగానికి అనూహ్యమైన స్పందన రావడంతో, రెండవభాగం పై రాజమౌళి మరింత శ్రద్ధ పెట్టాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభంపై జక్కన్న ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 14 నుంచి మొదలు కావొచ్చనే టాక్ వినిపించింది. ఇప్పుడు అదే తేదీని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. పండితుల సూచన మేరకు డిసెంబర్ 14 న పూజా కార్యక్రమాలతో షూటింగును ఆరంభించాలని అనుకుంటున్నారట.
అంతేకాదు రెండవ భాగం కోసం ఆయన ఇతర భాషల నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ప్రతి షెడ్యూల్ కి మధ్య విరామం తీసుకునే రోజులను మినహాయించి, 190 వర్కింగ్ డేస్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడు. ప్రభాస్ కూడా షూటింగ్ నిమిత్తం 10 నెలల సమయాన్ని కేటాయించాడు. ఇదంతా చూస్తుంటే, వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదలవుతుంది అన్న ఆశలు చిగురిస్తున్నాయి. అయితే బాహుబలి విషయంలో అనుకున్నది అనుకున్న సమయానికే జరగలేదు, అలాంటిది ఇప్పటినుంచే ఊహించేసుకోవటం మంచిది కాదని పలువురు అంటున్నారు. చూద్దాం వచ్చే ఏడూ చివర్లోనా లేదా 2017 కి వెళుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి క్లారిటీ రావాల్సింది రాజమౌళి నుంచే.