విడుదలకు ముందే ఎన్నో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బాహుబలి సినిమా ఆడియో మే 31న జరగాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆడియో వేడుకను తిరుపతికి మార్చారు. ఈ క్రమంలోనే అక్కడ ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో ఈ వేడుక ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ ఆడియో వేడుక బాహుబలి టీం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుక కూడా హైలైట్ గా నిలిచిపోతుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం! ఇదిలావుండగా.. బాహుబలి ఆడియో వేడుక ఏర్పాట్ల గురించి రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ... ఓ హెచ్చరిక కూడా జారీ చేశాడు. బాహుబలి ఆడియో వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ డిపార్టుమెంట్, బాహుబలి టీం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకకు చిన్న పిల్లలను, పెద్దవారిని తీసుకురావొద్దని రాజమౌళి అభిమానులకు విన్నవించారు. అలాగే.. ఈ వేడుకకు సంబంధించిన పాసులు తాము అమ్మడం లేదని ఎవరైనా అమ్మితే.. వాటిని కొనద్దని ఆయన సూచించారు. అలా కొంటే.. కొన్నవాళ్లు మోసపోయినట్లేనని తెలిపారు. ఈ ఆడియో వేడుకకు సంబంధించిన పాసులను తాము ప్రభాస్ అభిమాన సంఘాలకు స్వయంగా అందించినట్లుగా రాజమౌళి తెలిపారు. అభిమాన సంఘాల అధ్యక్షులు, రానా మేనేజర్స్ వద్ద పాసులు లభిస్తున్నాయని.. అక్కడి నుంచి పాసులు తీసుకుని వేడుకకు హాజరవ్వొచ్చని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.