గత రెండున్నరేళ్లుగా అందరినీ ఊరిస్తూ తెరకెక్కుతున్న బాహుబలికి గుమ్మడికాయ కొట్టేశారు. మంగళవారం సాయంత్రం చిత్రీకరణ పూర్తికావడంతో గుమ్మడికాయను కొట్టేశారు. యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని రూపొందిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు విపరీతంగా ఉన్నాయి. తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రీకరించనున్నారు. ఎక్స్ ట్రార్డినరీ సెట్లలో ఈ సినిమాను రూపొందించారు. చివరిగా బల్గేరియా షెడ్యూల్, రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ను చేశారు. ఈ మేలో వేసవి కానుకగా తొలి భాగాన్ని విడుదల చేయనున్నారు. మిర్చి తర్వాత ఈ సినిమా కోసమే ప్రభాస్ తన కాల్షీట్లను కేటాయించారు. మరే సినిమాకూ ప్రభాస్ ఇంతగా కష్టపడలేదన్నది వాస్తవం. అనుష్క, తమన్నా నాయికలు. రాజమాతగా రమ్యకృష్ణ నటించింది. మన దేశంతో పాటు విదేశీ సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమాకు నగిషీలు చెక్కుతున్నారు. కీరవాణి సంగీతాన్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.