‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ మేడే సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ రాజమౌళి క్రియేటివిటీకి అద్దం పడుతున్నట్టుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న బాహుబలి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే... అయితే ఈ సినిమా తొలి భాగాన్ని 'బాహుబలి ది బిగినింగ్'గా పిలుస్తున్నారు. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్య కృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మే 15న విడుదల చేస్తామని రాజమౌళి అనౌన్స్ చేసినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడం వల్ల, ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే 31న అఫీషియల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. రాజమౌళి ఈ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకనే చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని రాజమౌలి తెలిపారు. ‘బాహుబలి' సినిమాకు ఇంటర్నేషనల్ హైప్ తేవడంలో భాగంగా...ప్రొడక్షన్ టీం ఆసియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ జామేస్ మార్ష్‌కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఆసియాకు సంబంధించిన సినిమాలపై ఆయన రాసే ఆర్టికల్స్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ‘బాహుబలి' సెట్స్ ను సందర్శించిన ఆయన ‘బాహుబలి' సినిమా మేకింగుపై ఆర్టికల్ రాయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు ఇంటర్నేషనల్ మేగజైన్లలో బాహుబలి గురించిన ఆర్టికల్స్ రానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం రైట్స్ హిందీలో కరన్ జోహార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చిత్రాన్ని జులై 10న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే కన్ఫమ్ చేశాడు.