తెలంగాణ అహింసాయుత పోరాట స్ఫూర్తితో దర్శకుడు లక్ష్మణ్ మురారి నిర్మించిన ‘బందూక్’ మూవీ ఆడియోను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ జీవితాన్ని, ఉద్యమ స్వభావాన్ని వివరిస్తూ మొదటిసారిగా పూర్తిగా తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో బందూక్ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా స్థానిక చిత్ర పరిశ్రమను కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని చిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు మరింత క్రియాశీలంగా మారాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, సాగునీటిశాఖ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్, ప్రొడ్యూసర్ గుజ్జ యుగంధర్ రావు, సినిమా కో డైరెక్టర్ రమేశ్ మాదాసు పాల్గొన్నారు.