దివంగత దర్శకుడు బాపు జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 15 నుంచి హైదరాబాదు ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన చిత్రాల ప్రదర్శన జరుగుతోంది. ఈ నెల 21 వరకు బాపు చిత్రాలను ప్రదర్శిస్తారు. ఆయన జయంతి సందర్భంగా నరసాపురంలో సోమవారం ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపు విగ్రహాన్ని మంత్రి రఘునాథరెడ్డి ఆవిష్కరించారు. ఏటా డిసెంబర్ 15వ తేదీన బాపు జయంత్యుత్సవాలను శాశ్వత అధికార కార్యక్రమంగా నిర్వహిస్తామని రఘునాథరెడ్డి తెలిపారు. బాపుతో పోల్చుకో దగిన వ్యక్తులు తెలుగుగడ్డపై ఇక పుట్టబోరన్నారు. కార్టూనిస్టుగా ఆయన స్థానం నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్మించే కళాక్షేత్రానికి బాపు, వెంకటరమణల పేరు పెడతామని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు.