అహా నా పెళ్ళిలో అరగుండుతో కనిపించిన ఆ బ్రహ్మానందం ఎక్కడ వెయ్యి చిత్రాలు పూర్తి చేసిన ఈ బ్రహ్మానందం ఎక్కడ. కాస్త గుర్తు పట్టడం కష్టమే మరి... ఆయన సినీ ప్రస్థానంలో హాస్య గుళికలు ఎన్ని మింగుంటాం మనం... వైవిధ్యమైన పాత్రల పేర్లతో, అంతకన్నా వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు బ్రహ్మీ. ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం తాజాగా 1000 సినిమాల రికార్డును బ్రేక్ చేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర బస్సు' చిత్రంతోనే ఆయన ఈ మైలురాయిని దాటారు. ఈ విషయమై ఆయన్ను కదిలిస్తే..తన 1000వ చిత్రం ఏదో కూడా గుర్తు లేదన్నారు. గతేడాది తన 997 చిత్రం తరువాత నుండి గుర్తు పెట్టుకోవడం వదిలేశానని అంటున్నారు. 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమం ద్వారా మొదల ప్రేక్షకుల కళ్ళలో, నెమ్మదిగా సినిమా వాళ్ళ కళ్ళలో పడ్డారు. బ్రహ్మానందంను సినిమా కెమేరా ముందు నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది.