డబ్బులు ఎక్కువ ఎక్కడ ముడుతున్నాయో చూసుకుని, ఆ ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లు గా ప్రచారం చేస్తుంటారు సినిమా వాళ్ళు. ఇప్పుడు మ్యాగీ గోల ఆ ప్రొడక్టు ప్రచారకర్తలకు పెద్ద తలనపొప్పిగా తయారైంది. తమను తాము రక్షించుకునే దారులు వెతుక్కుంటున్నారు. ఎప్పుడో 12 ఏళ్ళక్రితం ఈ ప్రాడక్ట్ యాడ్‌లో నటించానని అంటోంది బాలీవుడ్ నటి ప్రీతి జింతా..... మ్యాగీ గురించి అప్పట్లో తనకు తెలియదని చెబుతోంది. ఆ ప్రొడక్టు వ్యవహారంతో తనకు సంబంధం లేదంటోంది. ఆ యాడ్ నేను చేసినప్పటి మ్యాగీ తాలూకు శాంపిల్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఉంటాయా అని తన ట్విటర్‌లో అమాయకంగా ప్రశ్నించింది. ఈ వివాదంలో ఈమెతోబాటు అమితాబ్, మాధురీ దీక్షిత్‌లపై బీహార్ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాడక్ట్‌కు తాను ప్రచారకర్తగా వ్యవహరించేముందు.. దీని గురించి నెస్లే సంస్థతో చెక్ చేసుకున్నానని, ఇది ప్రజల ఆరోగ్యానికి దోహద పడేదేనా అని తన కాంట్రాక్ట్ (ఒప్పందం)లో ప్రశ్నించానని అమితాబ్ మీడియాతో అన్నారు. ఇందులో ఏదైనా హానికరమైనది ఉంటే అంగీకరించబోను అని స్పష్టం చేశానని చెప్పారు. అయినా ఆ సంస్థతో నా కాంట్రాక్ట్ ముగిసింది అని అమితాబ్ పేర్కొన్నారు. ఇక మాధురీ దీక్షిత్ కూడా మ్యాగీకి సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలు తననెంతో ఆందోళనకు గురి చేశాయని తెలిపింది. నాణ్యతకు కట్టుబడి ఉంటామని నెస్లే సంస్థ తనకు హామీ ఇచ్చిందని ఆమె కూడా చెప్పుకొస్తోంది.