ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం ఇలా సినిమా సినిమాకు సంబంధం లేకుండా కొత్త కొత్త ప్రయోగాలతో హిట్లు కొట్టిన టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. మొదటి చిత్రం ఐతే తో నేషనల్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ఆయన చివరి చిత్రం సాహసం వచ్చి రెండేళ్లు దాటుతున్న ఇంతవరకు తన తదుపరి సినిమా గురించి ప్రకటించలేదు. అయితే అందరికీ షాకిస్తూ ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టును ప్రకటించారు.
మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్, విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓ నూతన చిత్రం ప్రారంభంకానుంది. ఇక ఈ మూడు భాషల్లోనూ యేలేటినే దర్శకత్వం వహించనున్నాడు. చంద్రశేఖర్ చెప్పిన కథ నచ్చటంతో మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వారాహి ప్రొడక్షన్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాత సాయి కొర్రపాటి స్వయంగా వెల్లడించారు. ఇక ఈ చిత్రం నవంబర్ 3వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని, మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు. మొత్తం ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి ఒక్క ప్రాజెక్టులో పనిచెయ్యటం సర్వత్రా ఆసక్తికలిగిస్తోంది. మోహన్ లాల్ సాధారణంగా ఫ్యామిలీ ఓరియెంటల్ చిత్రాలతో ఆకట్టుకుంటాడు. మరి యేలేటి ఏ టాపిక్ ను టచ్ చేస్తాడో? చూద్దాం...