బాల నటుల నుంచి హీరోలుగా ఎదిగిన వైనం మన తెలుగు సినిమాల్లో బాగానే కనిపిస్తుంది... కాకపోతే బాగా క్లిక్కయిన వారు బహుతక్కువ. తరుణ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కావడం వల్ల మొదటి సినిమా బాగా హిట్ అవడంతో ఇతగాడి సినిమాలు అప్పట్లో వరుసపెట్టి బాగానే సక్సెస్ అయ్యాయి. బాలాదిత్య, తనిష్ లాంటి వాళ్ళు కూడా హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే.
ఇప్పుడు కొత్తగా మరో హీరో లైన్ లోకి వచ్చాడు. 'ఆంధ్రుడు', 'పెదబాబు', 'అతడు', 'లెజెండ్' సహా దాదాపు నలభై చిత్రాల్లో బాలనటుడుగా అల్లరి చేసిన దీపక్ సరోజ్ తాను కూడా హీరో అవ్వాలన్న కోరికతో వచ్చేస్తున్నాడు. 'వందనం' అనే చిత్రంలో ఈ కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు ఎంట్రీ సాధించిన 'మిణుగురులు' చిత్రంలో లీడ్‌రోల్‌లో నటించిన దీపక్, రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన 'టామీ' చిత్రంలో కూడా కీలకపాత్రలో నటించాడు. శర్వానంద్ లాంటి నటులు ట్రైనింగ్ తీసుకున్న వైజాగ్ సత్యానంద్ వద్ద దీపక్ శిక్షణ పొందాడట. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తొలి బాలనటుడు దీపక్ కావడం విశేషం. లెజెండ్ సినిమాలో చిన్న బాలయ్యగా కూడా దీపక్ నటించాడు.
ఏ హీరో అయినా మొదట ఓ లవ్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్టే దీపక్ కూడా 'వందనం' చిత్రంలో లవ్ బ్జెక్ట్ తోనే పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇంతవరకు తెలుగు స్క్రీన్ మీద రానటువంటి కథ ఇది. ఆద్యంతం వైవిధ్యంగా ఉంటూ అందర్నీ అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. మరిన్ని మంచి చిత్రాల్లో హీరోగా నటించేందుకు ఈ సినిమా దోహదపడుతుంది'’ అని అంటున్నాడు. మరి ఈ హీరోగారి పెర్ఫార్మెన్స్ చూడాలంటే వందనం సినిమా విడుదల కోసం వెయిట్ చేయాల్సిందే.