చిరంజీవి 150వ చిత్రం చరిత్ర సృష్టించేలా ఉండాలని మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరుతో సినిమా కథ రెడీ చేయాలనుకున్నారు కూడా. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్ర తో చిరంజీవి 150వ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తరువాత ఆ పేరు, ఆ కథల గురించిన వార్తలు సద్దుమణిగాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పేరును గుర్తు చేశారు. పరుచూరి వెంకటేశ్వర రావు. చిరంజీవిని ఆ పాత్రలో చూడాలని వుందని తన కోరిక బయట పెట్టారు. రుద్రమదేవి ఆడియో లాంచ్ ఫంక్షన్‌లో చరిత్ర నేపథ్యంలో వచ్చే సినిమాల్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం వుందని చెబుతూ అల్లూరి సీతారామరాజు, భక్త కన్నప్ప వంటి సినిమాలు వచ్చి వుండకపోతే వారు నిజంగా ఎలా వుండి వుండేవారో తెలిసే ఛాన్స్ లేదని అభిప్రాయపడ్డాడు. అలాగే చిరంజీవి కూడా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా చేస్తే ఆ పాత్ర కూడా జనానికి గుర్తుండిపోతుందని అన్నారాయన. ఈ సినిమాకు స్క్రిప్టు వీరే రాస్తున్నట్టు ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. మరి చిరంజీవి తన 150 చిత్రం ఎలా ఉండాలనుకుంటున్నారో, పరుచూరి వారి మాటలు వారి చెవిన పడితే, అప్పుడైనా ఈ స్వాతంత్ర్య సమరయోధుని కథ గురించిన ఆలోచన చేస్తారేమో వేచిచూడాల్సిందే.