తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అంటే రాజమౌళి అనే చెబుతారు, మరి తమిళంలో నెంబర్ వన్ అంటే శంకర్. వీరిద్దరికీ ఉన్న పోలిక ఏమిటంటే ఎక్కడా కాంప్రమైజ్ కారు, ఇద్దరూ తామనుకున్నది రాబట్టేవరకూ రాక్షసుల్లా పని చేస్తారు. ఖర్చుకు వెనుకాడ కూడదు. రెమ్యునరేషన్ ఎంతున్నా అవసరమనుకుంటే పెద్ద స్టార్లను తీసుకుంటారు. ఒక్కోసారి చిన్న నటులైనా ఔట్ పుట్ అద్భుతంగా తీయడంలో వీరికి వీరే సాటి. అటు విమర్శలకు తావీయరు. శంకర్ సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనే తాపత్రయం కనపడుతుంది. అలాగే హీరోయిజాన్ని చూపించడంలో రాజమౌళి దిట్ట. ఇక అసలు వీరిద్దరి మధ్య తేడా ఎక్కడంటే... మామూలు విషయాలమీదే మనసుకు హత్తుకునేలా తీయగల సత్తా ఉన్న వాడు రాజమౌళి అయితే, ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలు, జిమ్మిక్కులు, సైన్స్ జోడించి శంకర్ సినిమాను రక్తి కట్టిస్తారు. రాజమౌళి బ్లాక్ బస్టర్స్ విక్రమార్కుడు, మగధీర, ఈగ, మర్యాద రామన్న చిత్రాలు కథ విషయానికి వస్తే మామూలుగానే అనిపిస్తాయి. కానీ, వాటిల్లోని ప్రతీ సీన్, చూసే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఎనర్జిటిక్ గా ఉంటాయి. అలాగే శంకర్ ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో... చిత్రాల కథలూ, టేకింగ్ వైవిద్యంగానూ కొత్త దనం కనిపిస్తుంది. అందుకే కాబోలు రాజమౌళి శంకర్ తన అభిమాన డైరెక్టర్ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఎంతో కాలంగా ఐ, బాహుబలి సినిమాలకు శ్రమిస్తున్నారు. ఈ సినిమాలు వీరి స్థాయిని ఏ మేరకు తీసుకువెళతాయో ఊహకందని అంశం.