సినీ జనాలంతా జూలై 10 కోసం ఆవురావురంటూ ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మూడేళ్లపాటు కంటి మీద కునుకు లేకుండా చేసి మరి తీసిన బాహుబలి ఎలా ఉంటుందో అని ఫ్యాన్సే కాదు, యావత్ దేశమంతా ఎదురుచూసేలా చేసి పాడేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇతిహాసాల ప్రేరణతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు రాజన్న. అయితే యుద్ధాలకు సంబంధించి సినిమా కావటం, హాలీవుడ్ తరహాలో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడటంతో చిత్రంపై మొత్తం దేశం దృష్టిసారించింది. ఇక అసలు విషయానికొస్తే ఇటీవలె సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యూ బై ఏ సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే. అంతేకాదు చిత్ర నిడివి 165 నిమిషాలు, అంటే 2 గంటల 45 నిమిషాలు ఉన్నట్లు సెన్సార్ బోర్డు ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర రన్నింగ్ టైంని మరో పావు గంట తగ్గించి, 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉండేలా ఫ్లాన్ చేస్తున్నాడట. యుద్ధ సన్నివేశాల నిడివే ఎక్కువ ఉంటుందని ఇప్పటికే చెప్పేశాడు. పైగా యంగ్ ప్రభాస్, తమన్నా లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ మరి ఇవన్నీ ఈ రెండున్నర గంటల్లో తేల్చేయటం సాధ్యమేనా. కీలక పాత్రలు ఎక్కువగా ఉండటంతో అన్నింటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే జనాల వైపు నుంచి నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఈ ఏడాది వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఇందుకు మంచి ఉదాహరణ. బోల్డెన్నీ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ దర్శకుడు త్రివిక్రమ్ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బాహుబలి విషయంలో కూడా రాజమౌళి ఇలా చిత్రాన్ని కోసుకుంటూ పోతే అసలు కథకు, క్యారెక్టర్లకు దెబ్బ పడే అవకాశం ఉండోచ్చెమో. మొత్తానికి కథేంటో, ఈ కత్తెరెంటో జనాలకు పిచ్చెక్కిపడేస్తున్నాడు జక్కన. అన్నట్లు బాహుబలి ఇంగ్లీష్ వర్షన్ ను కేవలం 1గంట మాత్రమే ఉండేలా ఫ్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని రాజమౌళియే స్వయంగా ప్రకటించాడు. కాకపోతే హాలీవుడ్ వర్షన్ కి మరో 2 నుంచి 3 నెలలు టైం పట్టే అవకాశం ఉందని తెలియజేశాడు.