కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్,స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలు చవి చూస్తోంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి 'తిరుపుర సుందరి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ - "ఈ చిత్రకథ గురించి నాకు వెలిగొండ శ్రీనివాస్ చెప్పాడు. చాలా బాగుంది. సినిమా కూడా బాగా వస్తోందని విన్నాను. 'గీతాంజలి'కన్నా ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
చిత్ర నిర్మాతలు చినబాబు, రాజశేఖర్ లు మాట్లాడుతూ - ''అనుకున్న విధంగానే షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం జరుపుతున్న రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన'గీతాంజలి'కి మించిన ఉత్కంట భరితంగా ఈ చిత్రం ఉంటుంది. స్వాతి మంచి నటి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను అద్భుతంగా చేస్తోంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చూసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. '' అన్నారు.
దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ- "కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ సమకూర్చిన స్ర్కీన్ ప్లే ప్రధాన బలంగా నిలుస్తుంది. కమ్రాన్ అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇందులో ఉన్న నాలుగు పాటలకు చంద్రబోస్,రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందిస్తున్నారు" అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా,సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్,రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.