ఇటీవల విడుదలైన ఎన్.టి.ఆర్, మహేష్ బాబుల సినిమాలు వారి అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. సోషల్ నేట్ వర్కుల్లో ఎవరికి తోచినట్టు వారు వారిద్దరిపై కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా వీరిపై అభిమానులు వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ చేదు అనుభవాన్ని చవి చూడ్డం ఇద్దరికీ ఇది తొలిసారి కావచ్చు. ఈ ఇద్దరూ... అభిమానులనుంచి ఘాటుగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ చేసే ప్రాజెక్టులపై అభిమానుల ద్వారా కోట్లకు కోట్లు బిజినెస్ జరుగుతోంది. వారిచ్చే ప్రోత్సాహమే వీరిని ఆ స్థాయికి చేర్చింది కూడా. ఈ అపజయానికి పూర్తి బాధ్యత అభిమానులు ఇప్పుడు హీరోలపైనే వేస్తున్నారు. అయితే వీరిపై అభిమానులు యూట్యూబ్ లో బాహాటంగా విమర్శించడం చూస్తుంటే వారెంతలా కలతచెందారో తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన ఎన్టీఆర్ అభిమాని ఒక వీడియో క్లిప్పింగ్ ను ఆన్ లైన్ లో విడుదల చేశాడు. ‘‘ఇలాంటి సినిమాల్లో నటించడం వల్ల కెరీర్ లో ఘోరంగా దెబ్బతినడం జరుగుతుంది. గతంలో వచ్చిన రాఖీ, యమదొంగలలో చూపిన పెర్ఫార్మెన్స్ తో తెలుగువారిలో ఓ మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల వచ్చిన రభస, రామయ్య వస్తావయ్య అనే సినిమాల వల్ల సాధించేదేమిటి? మీలో ఉన్న టాలెంట్ ను మరికాస్త చూపించేలా మంచి సినిమాలు ఎన్నుకోండి’’ అంటూ అభిమాని విడుదల చేసిన ఈ వీడియోకు 50 వేల మంది సమర్థిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారంటే... ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాల మీద ఎంత ప్రభావం కనిపిస్తుందో తెలిసిపోతోంది. ఇదే విధంగా మహేష్ బాబు కూడా అభిమానుల నిరసనలకు ఎదుర్కొంటున్నాడు. మహేష్ ఆగడు సినిమాపై ఆస్ట్రేలియానుంచి ఓ అభిమాని ‘‘ఇలాంటి సినిమాలు తీయడం ఆపండి. ఇలాంటి సినిమాలు తీసే ముందు మీ తెలివిని కాస్త ఉపయోగించండి’’అంటూ కాస్త ఘాటుగానే సలహా ఇచ్చాడు. ఈ ఇరువురు హీరోలకు ఫ్యాన్స్ సలహాలు బుర్రకెక్కాయో లేదో. ఇక ముందు ఇలాంటి సినిమాలు రిపీట్ అయితే మాత్రం వీరికి అభిమానుల క్రేజ్ తగ్గడం ఖాయం.