బర్త్ డే స్పెషల్: అప్పటి దేవుడు ఎన్టీఆర్... ఇప్పుడు సుమన్...

August 28, 2015 | 12:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Suman_birthday_niharonline

సినిమా ఛాన్స్ కోసం సుమన్ పెద్దగా కష్టపడలేదు... చూడగానే ఆకర్షించే అతని అందం, ఫిజిక్ తో సినిమాలే ఆయన వెంట పడ్డాయి. మొదటి సినిమా ఛాన్స్ తమిళంలో (నీచల్ కులం-పోలీస్ ఆఫీసర్) అనుకోకుండా ఓ స్నేహితుడి ద్వారా వచ్చింది. తెలుగులో తరంగణి మొదటి సినిమా. అప్పట్లో అందరు హీరోలతో పోల్చితే సుమన్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈయన కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందాడు. స్టంట్స్ చేయడంలో ఈయనది ప్రత్యేక శైలి, రియాలిటీ ఉండడంతో... అతి కొద్ది సమయంలోనే ఆంధ్రుల అభిమాన హీరో అయ్యాడు. తన ఫిజిక్ తో ఫైట్స్ తో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయాడు. తెలుగులో కూడా చాలా పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేశాడు. ‘నేటి భారతం’ లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమాతో హీరోగా మరిన్ని అవకాశాను అందిపుచ్చుకోగలిగాడు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో అనేక సినిమాల్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ గానే నటించాడు. మొత్తం ఒక హాలీవుడ్ సినిమా(డెత్  అండ్ టాక్సిస్)తో కలిపి దాదాపు 150 సినిమాలకు పైగా నటించాడు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన పరభాషా నటుడు అంటే సుమన్ పేరునే చెప్పుకోవాలి. అందుకే ఆయనకు తెలుగు వాళ్ళంటే చాలా అభిమానమట. ఒక సందర్భంలో నేను తెలుగమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన సుమన్ అన్న మాట ప్రకారం డి.వి. నరసరాజు మనుమరాలు శిరీష ను పెళ్ళి చేసుకున్నాడు. ఈయనకు ఓ కుమార్తె.

   మంగుళూరుకు చెందిన సుమన్ తల్వార్ చెన్నైలో జన్మించాడు (1959 ఆగస్టు 28). ఈయన తల్లి, కేసరీ చందర్ మద్రాసులోని యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేశారు. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. సుమన్ బాల్యంలో మద్రాసులోని చర్చ్‌ పార్క్ కాన్వెంటులో ప్రైమరీ, బీసెంట్ థియొసోఫికల్ టెంత్ పూర్తి చేశాడు. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో బీ.ఏ (ఇంగ్లీష్) చదివాడు. ఈయన తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ మరియు హిందీ బాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. సుమన్ హెచ్.ఏ.ఎస్.శాస్త్రి వద్ద సంస్కృతం కూడా నేర్చుకున్నాడట. ఇవేకాక, ఈయన వీణ, గిటార్ కూడా వాయించ గలడు. ఈయన కరాటేలో బ్లాక్‌ బెల్టర్ కావడంతో సినిమాలకు రాకముందు వృత్తి జీవితాన్ని సెన్సే (కరాటే మాస్టారు)గా పని చేశాడు.

అయితే సుమన్ జీవితం స్టార్ గా చాలా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అనుకోని విధంగా ఓ నీలిచిత్రాల నిర్మాణం స్కాంలో చిక్కుకొని కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాడు. కానీ చివరకు దాన్నుండి విజయవంతంగా బయటపడ్డాడు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ ఆయనను ఆహ్వానించి ఎన్నో ఛాన్సులు ఇచ్చింది. ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నా... అందులో తరంగిణి, నేటి భారతం, 20వ శతాబ్దం, బావ బావమరిది, సితార, మెరుపుదాడి, ఆత్మబలం, అలెగ్జాండర్, అన్నమయ్య, దేవుళ్ళు, శ్రీరామదాసు, లీడర్ వంటివి బాగా గుర్తిండిపోయే సినిమాలు. తమిళంలో రజనీకాంత్ కు విలన్ గా కూడా చేశాడు. 38 ఏళ్ళుగా వివిధ పాత్రల్లో నటిస్తూ... ముఖ్యంగా దేవుడు పాత్రలకు సమన్ మాత్రమే సరిపోతాడనే స్థాయికి చేరుకున్న సుమన్ మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటూ... నీహార్ ఆన్ లైన్ సుమన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ