కలం, కాగితం ఆయనకు ప్రాణం. ఈ అధునాతన యుగంలో కూడా పెన్ను పేపర్ ను వదలనని భీష్మించుకుని కూర్చున్నాడు. అలాగే కంప్యూటర్ పై పనిచేసే వారికి కూడా చాలా గౌరవం ఇస్తారు. తన కవిత్వానికి కలంతో మరింత అందాన్ని తెచ్చాడు. దశాబ్దాలుగా బాలీవుడ్ కి సేవలు అందించాడు. సంపూర్ణసింగ్ కైరా. ఇలా అంటే ఎవరికీ తెలీయదు. గుల్జార్ అంటే ప్రతీ ఒక్కరికీ తెలుసు. దేశం మొత్తానికి సుపరిచితుడు. కవిత్వం ఎందరినో అలరించింది... ఆయన దర్శకత్వ ప్రతిభతోనూ పలు చిత్రాలు తెరకెక్కి తమదైన బాణీ పలికించాయి. కథకుడిగానూ గుల్జార్ పలు చిత్రాలకు ప్రాణం పోశారు. 'గుల్జార్'తోనే ఆయన పాపులర్ అయ్యారు. ఈరోజు ఆయన జన్మదినం. 81 వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి నీహార్ ఆన్ లైన్...
1936, ఆగష్టు 18 న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినా లో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం ఢిల్లీ కి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ మరియు పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించారు. బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాట రాశాడు. మీనా కుమారి మరణించిన తరువాత ఆమె వ్రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చు వేశాడు. ప్రముఖ మరాఠీ రచయిత అమృతా ప్రీతమ్ రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్ (హైకూ)రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన ఉర్దూ కథా సంకలనం ధువాఁ (పొగ) కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉదారవాద కవి అయిన గుల్జార్ లైకిన్, ఆంధీ, పరిచయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
గుల్జార్ ఆయన కవిత్వానికి ఫిదా అయిపోయిన అందాల తార రాఖీ ఆయనకు జీవితభాగస్వామి అయింది. కానీ, ఆ తర్వాత ఎందుకో వారిద్దరు విడిపోయారు. వారి కూతురు మేఘన కూడా సినిమా డైరెక్టర్.
గుల్జార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తూ సాగాయి... ఇక ఆయన పాటలతో ఎందరో దర్శకులు తమ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. అస్కార్ లో భారత్ సత్తా చాటిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో జయ హో పాట ఈయన కలం నుంచి జాలువారిందే. భారత దేశానికి అవార్డు సాధించడంలో తన పాత్ర ఉండడం తన అదృష్టమంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయన కంటతడి పెట్టారు.
కజరారే, బీడీ జలై లే, దిల్ హుం హుం కరే వంటి ఎన్నో గొప్ప పాటలకు సాహిత్యాన్ని అందించారు. అందరినీ ఆలోచింపచేసేలా ఆయన తెరకెక్కించిన 'మాచిస్' ఎందరికో స్ఫూర్తినిచ్చింది... చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత గుల్జార్ 2004 లో పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ నాటికీ తన కలం బలం చూపిస్తూ సాగుతున్న గుల్జార్ మరిన్ని వసంతాలు ఆనందంగా చూడాలని ఆశిద్దాం...