ఈ దర్శకుడి సినిమాలు బాగుంటాయి... అన్న టాక్ ఇంతకు ముందు వరకూ ఉండేది. దర్శకుడిని చూసి సినిమాలు చూసే స్థాయి మాత్రం ఇప్పుడు రాజమౌళి క్రియేట్ చేశాడు. ఇప్పటికీ హీరోలు సినీ ఫీల్డును ప్రభావితం చేస్తున్నప్పటికీ, సినిమా పెద్దదయినా, చిన్న దయినా, అందులో తారాగణం ఎవరైనా దర్శకుణ్ణి చూసి సినిమాలు చూడ్డమనే ట్రెండ్ సెట్ చేసింది మాత్రం దర్శకుడు రాజమౌళి అనేది అందరూ నిరభ్యంతరంగా ఒప్పుకుని తీరాల్సిన అంశం. ఈయన తీసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’ రిలీజ్ కోసం ట్రేడ్ వర్గాలతోపాటు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 15న ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీవీ శాటిలైట్ రైట్స్ కోసం రెండు ప్రముఖ ఛానెల్స్ పోటీ పడుతున్నాయనేది తాజా వార్త. బాహుబలి రెండు పార్ట్ లకు కలిపి ఓ ఛానల్ 18 కోట్లు ఆఫర్ చేస్తే, మరో ఛానల్ ఏకంగా 20 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. అయితే ఈ డీల్ మాత్రం రెండు పార్టుల రిలీజ్‌కు ముందు చేసుకుంటేనే వర్తిస్తుందని నిర్మాతలు కండిషన్ పెట్టారట. ఇప్పటి వరకూ నెంబర్ 1, 2 స్థానాల్లో ఉన్న హీరోల సినిమాలకు దాదాపు 9 కోట్లు పలికిన ఈ శాటిలైట్ రైట్స్ రేటు, ఇప్పుడు ఈ దర్శకుని ఇమేజ్‌తోనే బాహుబలికి ఈ భారీ ఆఫర్ పలికిందనుకుంటున్నారు సినీ వర్గాల్లో. ఈ విషయం ఇంకో వారంలో తేలుతుందని అనుకుంటున్నారు.