బాధ్యతలు సాయం కావు : సూర్య

October 24, 2015 | 12:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
tamil-actor-surya-latest-niharonline

ఎప్పుడూ ఒక్క మాట కూడా తూలని తమిళ హీరో సూర్య నడిగర్ సంఘానికి ఓ లేఖాస్త్రం సంధించాడు. ఇది సంచలన వ్యాఖ్యలుగా కోలీవుడ్ కోడై కూస్తుంది గానీ, ఇందులో ఎవరినో విమర్శిస్తున్నట్టు అనుకోడానికి కూడా లేదు. ఎవరికి వారు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఇది ఓడిన వారిపై విమర్శ అనుకోకుండా కొత్తగా ఎన్నికైన వారికి ఒక సూచన అనుకుంటే సంచలనం కాబోదు. కానీ ఎవరేది మాట్లాడినా దాన్ని వక్రీకరించడం మన ఇండస్ట్రీలో సర్వ సాధారణమై పోయాయి. సూర్య ఎప్పుడూ ఎవరినీ విమర్శించినట్టు కనిపించడు. ఎవరితో ఏం మాట్లాడినా చాలా స్మూత్ గా జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్టు ఉంటుంది. కొందరు బాహాటంగా విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. ఎన్నికలు ముగిసిన రెండోరోజు సీనియర్‌ నటి రాధిక ట్విట్టర్‌ ద్వారా విశాల్‌ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించింది... ఇప్పుడు సూర్య లేఖ దానికి కౌంటర్ అని అనుకుంటున్నారు. కానీ అలా అనుకోడానికి కూడా లేదు. నడిగర్‌ సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ సూర్య శుక్రవారం ఒక లేఖ రాశారు. అందులో బాధ్యతల్ని సాయంగా చెప్పుకోవద్దని హితవు పలుకుతూ కొత్తగా ఎన్నికైన వారికి సూచన చేశారు. అది పాత వారికి విమర్శ అనుకుంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంటుందంతే... కమల్‌హాసన్‌, విశాల్‌, కార్తీ సినిమాలు కష్టాల్లో ఉంటే తాను ఎంతో సాయం చేశానని, అందుకు వారికి కృతజ్ఞత కూడా లేదని శరత్‌కుమార్‌ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయానికి ఇది కౌంటర్ అంటున్నారు.  ‘మీ బాధ్యతల్ని సాయంగా చెప్పుకోకండి. సంఘం సమైక్యతకు కృషిచేయండి. సీనియర్లను గౌరవించండి. కులం, భాష, జాతి పేరుతో దూషణలకు తావివ్వద్దు’ అని సూర్య తన లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నూతన కార్యవర్గం వ్యవహరించాలని సూర్య సూచించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి జోక్యం చేసుకోని సూర్య ఇలా హఠాత్తుగా లేఖాస్త్రం సంధించడం ఇండస్ర్టీలో సంచలనం కలిగించింది. తన తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌పై శరత్‌కుమార్‌ వర్గం చేసిన వ్యాఖ్యలు కూడా సూర్య లేఖ కు  కారణం అయ్యుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి... గొడవలకు తావీయొద్దనే సూచించినట్టు అనుకోవాలి. దీన్ని వక్రీకరించి అవతలి వర్గం వారు గానీ విమర్శ చేస్తే... అది సంస్కార లోపమే అవుతుందంటున్నారు న్యూట్రల్ గా ఆలోచించేవారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ