మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా ఒక చిత్రానికి పాటలు స్వరపరచాలంటే ముందు ఆయనకు కథ నచ్చాలి. అందుకే ఇళయరాజా ఓ సినిమాకి పాటలు స్వరపరిస్తే.. కచ్చితంగా ఆ చిత్రకథలో దమ్ము ఉందని అనుకోవచ్చు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'అబ్బాయితో అమ్మాయి' ఈ కోవకే చెందుతుంది. జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. అత్యంత వైభవంగా హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకలో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇంకా పలువురు అతిరధ మహారధులు ఈ వేడుకలో పాల్గొంటారు.
''నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు రమేశ్ వర్మ వివరించారు. మరి అన్ని యూత్ ఫుల్ లవ్ స్టోరీలాగానే ఇది ఆకట్టుకుంటుందా? నాగశౌర్యకు హిట్ అందిస్తుందా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.