ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా చూసిన తరువాత దేవుడంటే ఇలాగే ఉంటాడు కాబోలు అన్నంత భ్రమలో పడిపోయారంతా... ఆయన నటించిన సినిమాల్లోని పాత్రలకు అంతటి పేరు ప్రఖ్యాతులు సొంతమయ్యాయి. అయితే ఆ తరువాత అలాంటి పాత్రలు ఏవైనా సినిమాలో పెట్టాలంటే అందరికీ గుర్తుకు వచ్చేది సుమన్. హీరోగా సినిమా పరిశ్రమలో 37 ఏళ్లుగా కొనసాగుతూ 350 సినిమాల్లో నటించాడు సుమన్. దేవుడి పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ తరువాతి స్థానం తనకు దక్కిందని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇటీవల ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ‘జై తెలంగాణ' అన్నది తానొక్కడినే అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రెండువేల ఎకరాలు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందకరం అన్న ఆయన... హైదరాబాద్ ను సినిమా రాజధాని చేయాలన్నారు. సినిమా షూటింగులకు హైదారాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతమన్నారు. తెలంగాణలో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని, వారిని తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. సినిమా అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రానికోవిధంగా ఉండకుండా జాతీయ స్థాయిలో అందరికీ సమాన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళుతానన్నారు. ప్రజలను కాపాడే క్రమంలో అమరులయ్యే పోలీసు, జవాన్ కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని, అన్ని రకాల ప్రయోజనాలతో కలుపుకుని ఒక్కో కుటుంబానికి రూ. కోటి వరకు పరిహారం అందిస్తే బాగుంటుందన్నారు. తన తల్లిదండ్రుల స్పూర్తితో పేదల చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు.