జులై పది చరిత్రలో గుర్తిండిపోయే దినంగా నమోదు చేసుకోవచ్చునేమో... మునుపెన్నడూ తెలుగు సినిమా సృష్టించని చరిత్రలను బాహుబలి సృష్టించింది. ఇంతకాలం ఏ రికార్డ్సును అయితే ఎవరూ టచ్ చేయలేరని అనుకున్నామో ఆ రికార్డును కొట్టేయడమే కాకుండా... ఇక ఎప్పటికీ ఎవరూ దీన్ని చెరిపేయలేనంత సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది బాహుబలి. ఈ సినిమా మగధీర ఫుల్ రన్లో సాధించిన వసూళ్లను కేవలం తొలి మూడు రోజుల్లోనే రాబట్టేసింది. ట్రేడ్ పండితుల ప్రకారం, చరణ్ నటించిన మగధీర ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలుపుకుని దాదాపు 150కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం సహా రిలీజైన అన్నిచోట్లా ఎన్ని రోజులు ఆడిందో అన్నిరోజుల వసూళ్లు కలుపుకుని ఇంత మొత్తాన్ని ఆర్జించింది ఈ చిత్రం. అయితే ఈ మొత్తం గ్రాస్ రికార్డుల్ని బాహుబలి మూడు రోజుల్లోనే దాటేసింది. సండే రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.150కోట్ల పైగా వసూళ్లను సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఫుల్ రన్లో ఈ సినిమా వసూళ్లు 250 కోట్లను దాటి బాలీవుడ్ రికార్డుల్ని సైతం చెరిపేస్తుందని అంచనాలు వేస్తున్నారు.