జగపతి బాబు ఇంటర్వ్యూల్లో, సినిమా స్టేట్ మెంట్లలో ఓ విలక్షణమైన వ్యక్తిత్వం కనిపిస్తుంది. కొన్ని నగ్నసత్యాలు చెపుతున్నట్టనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో, ఎన్నో రకాల క్యారెక్టర్లలో నటించిన ఈయన ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అన్ని సమస్యలనూ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్యలొచ్చినప్పుడు కుటుంబం ఇచ్చే సపోర్ట్ ఎంతో ముఖ్యమైనది. అది అనుభవంలో తెలుస్తుంది. అందుకే కుటుంబం మీద ఈయనకు ప్రత్యేకమైన, గౌరవ భావం కనిపిస్తోంది. ఈ మధ్యే తన పెద్ద కూతురుకి ఓ అమెరికా అబ్బాయితో వైభవంగా పెళ్ళి చేశారు. అల్లుడితో పాటు ఓ ఫొటో దిగి తన సోషల్ నెట్వర్క్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. దాంతో పాటు ఆయన ఓ కొటేషన్ కూడా ఇచ్చాడు. ‘నీ కష్ట సుఖాల్లో నీ వెన్నంటి ఉండేది, తోడుగా ఉండేది, ధైర్యం చెప్పేది నీ ఫ్యామిలీ మాత్రమే అంటూ....’ చెప్పుకొచ్చాడు. తన కూతురు పెళ్ళి విషయంలో వచ్చిన విమర్శలను ఆయన పట్టించుకోలేదు... విమర్శించే వాళ్ళు మాటలకే పరిమితమవుతారు తప్ప, తమ కష్టంలో పాలు పంచుకోరనేది ఆయన ఉద్దేశం కాబోలు.