కమల్ హాసన్ ..ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన లెజెండ్రీ యాక్టర్. నటనలో ఆయనకు అసాధ్యమంటూ ఉండదనే రేంజ్ లో ఆయన సినిమాలుంటాయి. భారీ కమర్షియల్ సినిమాల్లో కనిపించే కమల్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవడానికి ఇష్టపడరు. పాత్ర చిన్నదా? పెద్దదా అని ఆలోచించకుండా కొత్తదనం కోసం పరితపిస్తుంటారు. అందుకు ఆయన చెప్పే సింపుల్ రీజన్ కొత్తగా చేయాలనిపించిందనడమే. ఆయన సినిమా ప్రతిదీ డిఫరెంట్ గా ఉండాలని ఆలోచిస్తారు..అదే ఆయన నైజం. అందుకే ఆయన యూనివర్సల్ హీరో అయ్యారు. కమల్ హాసన్ సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని సగటు ప్రేక్షకుడి నుండి ఇండస్ట్రీ వర్గాల వరకు ఆసక్తిగా ఎదరుచూస్తారు. అటువంటి అసామాన్య నటుడి నుండి వస్తోన్న మరో చిత్రమే ‘ఉత్తమవిలన్’.. అసలు విలన్ అంటేనే ప్రతినాయకుడు, అందులో ‘ఉత్తమ విలన్’ ఏంటి అనే విషయం గురించి ఆయన మాటల్లోనే..
‘ఉత్తమవిలన్’ చేయడానికి ప్రధాన కారణం...
ప్రతి సినిమా చేయడానికి ప్రధాన కారణం మనీ..డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. ఒకవేళ నిజంగా డబ్బులే పరమావధిగా అనుకుంటే ఎలాంటి సినిమా అయినా చేయవచ్చు. కానీ ఒక మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి పాయింట్ అనుకుని దానికి అనుగుణంగా సినిమా చేసిన దర్శకులు బాలచందర్ గారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్ గారు వంటి ఎందరో ఉన్నారు. నేను అటువంటి స్కూల్ కి చెందిన స్టూడెంట్ నే. అలాంటి ఒక డిఫరెంట్ పాయింట్ ఉత్తమ విలన్ చిత్రంలో ఉందనిపించే చేశాను.
‘ఉత్తమ విలన్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
తమిళనాట విల్లు పాట ప్రాచుర్యం చెందిన జానపద కళారూపం. దాన్ని ఈ సినిమాలో ఉపయోగించాం. దాన్ని డిఫరెంట్ గా అందంగా చూపించాం. అలాగే ఉత్తమ విలుకారుడు అని అనవచ్చు. ఇక ముఖ్యగా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న స్వభావం. మనల్ని హీరోగానో, విలన్ గానో చేస్తాయి. మన దృష్టిలో వేరే వాళ్లు విలన్ గా కనపడతారు. వేరేవాళ్ల దృష్టిలో మనం విలన్ గా ఉండవచ్చు. ఇక్కడ మనం చూసే దృష్టి, పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అటువంటి పరిస్థితులను ఎలా కంట్రోల్ చేసి ఉత్తముడిగా నిలవాలనేదే సినిమా.
మీరు దర్శకుడై కూడా రమేష్ అరవింద్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం రీజన్ ఏంటి?
ఈ కథ రాసుకున్నప్పుడే చాలా స్పాన్ ఉందని అర్థమైంది. అలాంటి సమయంలో సినిమాలో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయడం కుదరదనిపించింది. అదీ కాక రమేష్ అరవింద్ తో పరిచయం ఇప్పటిది కాదు. నా గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. తనైతే నా ఐడియాలజీని క్యారీ చేస్తాడనిపించింది. అందుకే తనని దర్శకత్వం చేయమన్నాను.
ఈ సినిమాలో కె.బాలచందర్, కె.విశ్వనాథం వంటి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ తో గతంలో పనిచేశాను కాబట్టి ఇందులో నేనేం ఇబ్బంది పడలేదు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాం.
కె.బాలచందర్ గారితో ఉన్న అనుబంధం?
మా నాన్నగారు లాయర్. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసేవారు. కానీ పదహారేళ్ల నుండి నాకు బాలచందర్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ప్రతి రోజు ఆయన్ని కలిసేవాడిని. ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా మంచి రిలేషన్ ఏర్పడింది. నా కోసం 36 సినిమాలకు స్క్రీన్ ప్లే రాశారు. ఆయన సినిమాలకు పనిచేసేటప్పుడు ఎన్ని రోజుల కాల్షీట్ కావాలని ఎప్పుడూ అడగలేదు. మరో చరిత్రకైతే 108 రోజులు పనిచేశాను. ఆ సినిమాలో నా కోసం భరతనాట్యం బిట్ ను పెట్టారు. ఆర్టిస్టుల కోసం స్క్రిప్ట్ రాసే దర్శకుడాయన. దేవుణ్ణి బంగారు పువ్వులతో పూజించలేని పేదవాడు, మామూలు పువ్వులతో పూజిస్తాడట. నేను కూడా ఆయన్న అలాగే పూజించాను.
సినిమా ఏ జోనర్ కి చెందింది?
సినిమా ఏమోషన్స్ ను క్యారీ చేస్తూ సాగిపోయే సినిమా. అలాగే ఫుల్ కామెడి ఉంటుంది. కథలో భాగంగా వచ్చే ఈ కామెడి ప్రేక్షకుడిని అలరిస్తుంది.
థెయ్యమ్ కళాకారుడి గెటప్ ప్రాధాన్యమేంటి?
ఈ గెటప్ కోసం ప్రతి రోజూ నాలుగు గంటలపాటు మేకప్ కోసమే సమయాన్ని కేటాయించాం. సినిమా సెట్స్ లోకి వెళ్లే ముందు అందుకు తగిన విధంగా స్టడీ చేశాం. పర్టికులర్ పాత్ర ప్రాధాన్యత గురించి చెప్పాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇందులో ఎనిమిదవ శతాబ్దపు కళాకారుడిగా, 21వ శతాబ్దపు కళాకారుడిగా కనిపిస్తున్నారు కదా? ఏదైనా పునర్జన్మకి సంబంధించిన స్టోరియా?
నేను సాధారణంగా పునర్జన్మలను నమ్మను. నేనే నమ్మనప్పుడు నా సినిమాలో వాటిని ఎందుకు చూపిస్తాను. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
‘ఉత్తమవిలన్’ సినిమాని బాలచందర్ గారు చూశారా?
ఆయన చనిపోయేటప్పటికి ఫస్ట్ కాపీ రెడీ కాలేదు. అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి యంగ్ బాలచందర్ సినిమా చూసినట్టుంది అన్నారు. ఆ కాంప్లిమెంటుతో సినిమా పెద్ద హిట్టయ్యిందని అనుకున్నాను. అదే నాకు పెద్ద గిఫ్ట్.
ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో సందడి చేస్తున్నారు కదా..ఎలా ఉంది?
నాలుగో సినిమాకి కూడా రెడీ అవుతున్నాను. ఇలా చేయడానికి కూడా నా గురువుగారు కె.బాలచందర్ గారే ఆదర్శం. ఆయన దర్శక, నిర్మాత, రైటర్ గా ఏడాది ఐదు సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఆయన స్ఫూర్తితోనే స్పీడ్ పెంచాను.