చాలా గ్యాప్ తరువాత మణిరత్నం ‘ఓకే బంగారం’ సినిమా తీసి తన యాజ్ యూజువల్ సక్సెస్ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో నటించిన నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంట యువతను గిలిగింతలు పెట్టేసింది. ముఖ్యంగా నిత్యామీనన్ నటన్ అద్భుతం అని అందరూ మెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత మణి రత్నం మళ్ళీ తన ప్రాజెక్టు గురించి ఏమీ వెల్లడి చేయలేదు. కానీ ఇటీవల కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే కార్తీతో సంప్రదించినట్టు తెలుస్తోంది. కార్తీ ఒకప్పుడు ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆయన సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరూ తహతహ లాడుతుంటారు. ఇప్పుడు కార్తీ పరిస్థితీ అదే. ఇక కార్తీ విషయం అలా ఉంటే, హీరోయిన్ గా శృతికి ఆఫర్ ఇవ్వనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శృతికి ఇంతకుముందే ఓ ఛాన్స్ వచ్చినప్పటికీ కాల్షీట్ల సమస్య వల్ల అది చేజారి పోయింది. ఇప్పుడు వచ్చే అవకాశాన్ని మాత్రం శృతి తప్పకుండా అందిపుచ్చుకోవాలని ఆశ పడుతోంది. అయితే ఈ ఇద్దరితో పాటు దుల్కర్ కు కూడా ఓ ప్రత్యేక పాత్ర ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శృతికి సినిమా ఆఫర్లు చాలానే వస్తున్నాయి... అవి అన్నీ అందాల ఆరబోతకే తప్ప నటనకు ప్రాధాన్యమైన పాత్ర ఇంతవరకూ రానట్టే లెక్క. ఇప్పుడు మణిరత్నం ఇచ్చే ఆఫర్ తనను ఏ రేంజ్ కు తీసుకువెళుతుందో చూడాలి.