బాహుబలి టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. ఏ చిన్ని అవకాశం వచ్చినా తమని తాము నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రాఫికల్ వర్క్స్ కు సంబంధించి దేశంలోనే తొలిసారిగా కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టిన జక్కన తాజాగా మరో నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ ఆర్కెస్ట్రాని సన్నద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు సంగీత దర్శకుడు కీరవాణి. అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా లైవ్ గా రికార్డ్ చేయడమన్నమాట. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రయోగం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ప్రసాద్ ల్యాబ్స్ లోని కీరవాణి స్టూడియోలో ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆఖరి పాట చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాను మే ప్రథమార్ధంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. అనుష్క, తమన్నా నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ , రానా అన్నదమ్ములుగా కనిపిస్తారు. రాజమాతగా రమ్యకృష్ణ, రాజుగా సత్యరాజ్ సందడి చేస్తారు. కన్నడ సుదీప్, నిత్యామీనన్ తో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు,తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఇక ఈ చిత్ర టీజర్, ఆడియో పంక్షన్ కోసం యావత్ ప్రేక్షుకులు వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు.