సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘తేనెమనసులు’ చిత్రం 1965 మార్చి 31న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015 మార్చి 31కి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ యాభై ఏళ్ళలో సూపర్‌స్టార్ కృష్ణ 353 చిత్రాల్లో నటించి ఎదురులేని, తిరుగులేని కథానాయకుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా, స్టూడియో అధినేతగా ఉన్నత శిఖరాలను అధిరోహించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మార్చి 31కి ‘తేనెమనసులు’ చిత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుండి హైదరాబాద్‌కు తరలి వచ్చిన అభిమానులు తమ అభిమాన హీరో సూపర్‌స్టార్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపి గజమాలలతో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ సేన రాష్ట్ర అధ్యక్షుడు దిడ్డి రాంబాబు, ఆల్‌ఇండియా కృష్ణ, మహేష్ ప్రజాసేన అధ్యక్షుడు ఖాదర్ గోరి, ఏర్పాటు చేసిన 50 వసంతాల భారీ కేక్‌ని సూపర్‌స్టార్ కృష్ణ అభిమానుల హర్షధ్వానాల మధ్య కట్ చేశారు. అనంతరం భారీగా బాణాసంచాను కాల్చి సూపర్‌స్టార్ కృష్ణ గోల్డెన్ జూబ్లీ ఇయర్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, ప్రముఖ నటుడు నరేష్, సూపర్‌హిట్ అధినేత, నిర్మాత బి.ఎ.రాజు పాల్గొన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ‘‘50 సంవత్సరాలుగా నన్ను అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకసారి నా అభిమాని అయినవారు జీవితాంతం నా అభిమానిగానే వుంటారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను అభిమానించడమే కాకుండా మా కుటుంబం నుండి ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా అభిమానించి ఆదరించారు. విజయనిర్మలగారు 45 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడానికి మీ ఆదరాభిమానాలే కారణం. అందుకు చాలా సంతోషంగా వుంది. మా తర్వాత సెకండ్ జనరేషన్‌లో నరేష్ హీరోగా ఇంట్రడ్యూస్ అయి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాడు. రమేష్ కూడా మంచి సినిమాలు చేశాడు. అతన్ని కూడా ఆదరించారు. ఇప్పుడు మహేష్‌ని సూపర్‌స్టార్‌ని చేసింది కూడా మీ అభిమానమే. థర్డ్ జనరేషన్‌లో నరేష్ తనయుడు నవీన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. నవీన్‌కి కూడా మీ ఆదరాభిమానాలను, ఆశీర్వాదాలు కావాలి. చిన్న పిల్లల విషయానికి వస్తే గౌతమ్ ‘1’లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. మా అమ్మాయి ప్రియదర్శిని, సుధీర్‌ల కుమారుడు చరిత్ మారుతి సినిమాలో నరేష్ కాంబినేషన్‌లో యాక్ట్ చేశాడు. చరిత్ చాలా బాగా చేశాడని నరేష్ చెప్పాడు. రాబోయే జనరేషన్‌లో మా ఫ్యామిలీ నుండి వచ్చే వారందర్నీ ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - ‘‘కృష్ణగారిది చిన్న పిల్లల మనస్తత్వం. ఆయన ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా నేను ఇన్ని సినిమాలు చేశానా అని ఆశ్చర్యపోతుంటారు. సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలు ఆయనకి అస్సలు తెలీవు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణగారు చాలా గొప్ప నటుడు. ఆరోజుల్లో నిర్మాతలు డబ్బుల్లేక సినిమా ఆపేస్తే కృష్ణగారు వారిని పిలిపించి షూటింగ్ పెట్టుకోండి అని చెప్పేవారు. అలా చెప్పేవారు ఈరోజుల్లో ఒక్కరు కూడా లేరు. ఆ ఘనత కృష్ణగారికి ఒక్కరికే దక్కింది. నిజంగా నేను కృష్ణగారి భార్యని అయినందుకు చాలా ఆనందిస్తున్నాను’’ అన్నారు.
నరేష్ మాట్లాడుతూ - ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో లివింగ్ లెజెండ్ సూపర్‌స్టార్ కృష్ణగారు. తేనెమనసులు చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ వేత్తగా, సామాజిక వేత్తగా అన్ని కోణాల్లో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ 50 సంవత్సరాల్లో భారత దేశచరిత్రలో అభిమానులందరికీ దశ, దిశలను కల్పించి సినీ పరిశ్రమలో నిలిచిన ఏకైక నటుడు కృష్ణగారు. కృష్ణ, విజయనిర్మల దంపతులిద్దరూ మా కుటుంబానికే కాకుండా సినీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. కృష్ణగారు ఇంకా మరెన్నో గొప్ప చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో పది కాలాలపాటు నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
బి.ఎ.రాజు మాట్లాడుతూ - ‘‘50 ఏళ్ళ క్రితం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో ‘తేనెమనసులు’ చిత్రం ప్రారంభమైంది. కృష్ణగారు నటించిన తొలి చిత్రం 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. కృష్ణగారి అభిమానులమైనందుకు అందరం గర్వపడేరోజు ఇది. ప్రపంచంలో వున్న కృష్ణగారి అభిమానులందరం ఈరోజునే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కృష్ణగారి అభిమానులందరూ జీవితంలో ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ముందుకు సాగుతున్నాం. కృష్ణగారికి భయం అనేది తెలీదు. ఏదైనా చెయ్యాలంటే వితిన్ మినిట్స్‌లో డెసిషన్ తీసుకొని జీవితంలో ముందడుగు వేశారు. కృష్ణగారు అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మంది అభిమానులకు ఒక ఇన్‌స్పిరేషన్ పర్సనాలిటీ. కృష్ణగారు, విజయనిర్మలగారి కాంబినేషన్ తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కాంబినేషన్. అభిమానులందరం కూడా ఈరోజు ఎంతో గర్వపడుతున్నాం. కృష్ణగారి అభిమానులం అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో జర్నీ అనేది జీవితంలో ప్రతి ఒక్క అభిమానికి కూడా మరపురానిది.. ఎప్పటికీ మర్చిపోలేనిది. నిజంగా కృష్ణగారికి అభిమానులమైనందుకు ఎంతో గర్వపడుతున్నాం’’ అన్నారు.