పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్.జె.సూర్య, నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ కాంబినేషన్ చెబితే గుర్తోచ్చేది హిట్ మూవీ ఖుషీ. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఆ చిత్రం ఓ మైలు రాయి. యూత్ లో పవర్ స్టార్ రేంజ్ మరింత పెరగడానికి కారణమయ్యింది. ఈ మధ్య సూర్య పవన్ ను కలిసి, ఖుషీ సీక్వెల్ చెప్పాడని, సర్దార్ తర్వాత పవన్ చేయబోయేది ఆ చిత్రమేనని టాక్. మరి పవన్ తర్వాతి చిత్రం అదేనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా 'ఖుషి' సీక్వెల్ తోపాటు ' వేదాళం' రీమేక్ కూడా కావొచ్చని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు పవన్ దృష్టి 'వేదాళం' రీమేక్ పై పడిందనే విషయం తెరపైకి వచ్చింది. ఈ మధ్య కాలంలో తమిళ్లో అజిత్ హీరోగా విడుదలైన ఈ సినిమా, 100 కోట్ల వసూళ్లను అవలీలగా సాధించింది. అజిత్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే స్థానాన్ని ఆక్రమించింది. తనకి గల మాస్ ఫాలోయింగ్ కారణంగా, ఈ సినిమా రిమేక్ ను ఎస్.జె.సూర్యతో పవన్ చేయాలనుకుంటున్నాడట. తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎ.ఎం.రత్నం తెలుగులోను నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్టులలో ఏది పట్టాలెక్కుతుందో చూడాలి.